పోలీసుల రాకతో ట్రాక్టర్లు పరార్
బషీరాబాద్: మండల కేంద్రంలో ప్రభుత్వ ఆస్పత్రి నిర్మాణానికి ఇసుక తరలింపు వివాదాస్పదంగా మారింది. గంగ్వార్ శివారు కాగ్నా వాగు నుంచి శుక్రవారం సుమారు 15 ట్రాక్టర్ల ద్వారా ఇసుక తరలిస్తున్నారని తెలుసుకున్న గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల రాకను గమనించిన ట్రాక్టర్ డ్రైవర్లు వాహనాలతో పారిపోయారు.
ఇబ్రహీంపట్నం రూరల్: మాదక ద్రవ్యాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, అలాంటి వాటికి దూరంగా ఉండాలని అదనపు కలెక్టర్ కిరణ్మయి పేర్కొన్నారు. నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా అవగాహన పోస్టర్‌ను శుక్రవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఆవిష్కరించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన అదనపు కలెక్టర్ కిరణ్మయి మాట్లాడుతూ.. 15ఆగస్టు 2020 నుంచి నేషనల్ యాక్షన్ ప్లాన్ పర్ డ్రగ్ డిమాండ్ రిడక్షన్ అమలు చేయబడుతుందన్నారు. మాదక ద్రవ్యాల వినియోగంతో సామాజిక, ఆర్థిక, ఆరోగ్యపరమైన నష్టాలు ఉన్నాయని వీటిపై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. జూన్ 17 నుంచి 26 వరకు నషా ముక్త్ సప్తాహ్ నిర్వహించాలని సూచించారు. జిల్లాలోని పాఠశాలలు, కళాశాలలు, యువజన సంఘాలు, స్వచ్చంధ సంస్థలు ప్రభుత్వ శాఖల భాగస్వామ్యంతో అవగహన ర్యాలీలు, ప్రతిజ్ఞ కార్యక్రమాలు, సదస్సులు, సాంస్కృతిక కార్యక్రమాలతో చైతన్యం చేయాలన్నారు.
మొయినాబాద్: కార్లు ఓవర్ స్పీడ్‌గా వెళ్తున్నాయని అడ్డగించడంతో జరిగిన ఘర్షణపై మొయినాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని వనస్థలిపురానికి చెందిన వీవీఎస్ సైరెల్ తన బంధువులతో కలిసి మూడు కార్లలో శుక్రవారం వికారాబాద్‌కు వెళ్లేందుకు బయలుదేరారు. మార్గమధ్యలో మొయినాబాద్ మున్సిపాలిటీలోని చిలుకూరుకు చేరుకోగానే అదే గ్రామానికి చెందిన కుమార్ అనే వ్యక్తి కార్లు ఓవర్ స్పీడ్‌గా వెళ్తున్నాయని అడ్డగించాడు. దీంతో ఆయనకు కార్లలో వెళ్తున్న వారికి వాగ్వాదం జరిగింది. ఇంతలో గ్రామంలోని మరికొంత మంది వచ్చి గుమ్మిగూడారు. ఈ క్రమంలో మాటామాటా పెరిగి దాడి చేసుకున్నారు. కార్లలో ఉన్న మహిళలపై కూడా దాడి చేయడంతోపాటు రాళ్లు వేశారు. దీంతో 100కు డయల్ చేయడంతో వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అందరినీ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మహేశ్వరం: ప్రమాదవశాత్తు బైక్ అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న గోడను ఢీకొట్టడంతో ఓ యువకుడు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ సంఘటన మండల పరిధిలోని ఆకన్‌పల్లి–కోళ్లపడకల్ బీటీ రోడ్డుపై గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. మహేశ్వరం సీఐ రాఘవేందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... కోళ్లపడకల్ గ్రామానికి చెందిన ఆకుల నరేశ్(28) కొత్తురు మండలం పెంజర్ల గ్రామంలో ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నారు. గురువారం రాత్రి పని నిమిత్తం మహేశ్వరం వెళ్లి తిరిగి స్వగ్రామానికి తన బైక్‌పై వెళ్తున్నారు. మార్గమధ్యలో అదుపుతప్పి పక్కనే ఉన్న ప్రహరీకి బలంగా ఢీకొని తీవ్ర గాయాలై దుర్మరణం చెందారు. శుక్రవారం తెల్లవారుజామున ఆకన్‌పల్లికి చెందిన రైతులు నరేశ్ మృతదేహాన్ని చూసి కోళ్లపడకల్ గ్రామస్తులు, బంధువులు, పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యులు మాత్రం నరేశ్ మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఫోన్ కాల్ డాటా, సిగ్నల్స్, సీసీ కెమెరాలను పరిశీలించి కేసును విచారించి రోడ్డు ప్రమాదమా? ఎవరైన హత్య చేశారా అని విచారణ చేపట్టాలని కోరుతున్నారు.


