పరిగి: ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో పంట సాగు చేసేందుకు ఎరువుల కోసం వెళ్లిన వ్యక్తి టిప్పర్ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన చిగురాల్‌పల్లి గేట్ సమీపంలో బుధవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ధారూర్ మండలం మోమిన్‌కలాన్ గ్రామానికి చెందిన జావిద్(30), బుధవారం గ్రామం నుంచి పరిగికి ద్విచక్ర వాహనంపై వెళ్లాడు. ఈ క్రమంలో పరిగి నుంచి లక్నాపూర్ వరకు రోడ్డు మరమ్మతు పనులు కోసం మట్టిని తరలిస్తున్న టిప్పర్.. జావిద్‌ను ఢీకొట్టి, అతని తలపై నుంచి వెళ్లడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. మృతుడికి భార్య ఖైరున్‌బీ, ఓ కుమారుడు ఉన్నాడని, ఖైరున్‌బీ మరలా గర్భంతో ఉన్నట్లు బంధువులు పేర్కొన్నారు.


