అనంతగిరి: మార్కెట్ విలువ ఆధారంగా భూముల ధరలు నిర్ణయించాలని కలెక్టర్ దీపక్ తివారి అధికారులకు సూచించారు. బుధవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో జిల్లాలోని పలు ప్రాంతాల్లో పవర్ గ్రిడ్ ద్వారా 765 కేవీ లైన్ల ఏర్పాటుపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పవర్ గ్రిడ్ పనుల నిమిత్తం సేకరించాల్సిన భూములపై రైతులతో చర్చలు జరపాలన్నారు. ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారం గురించి తెలియజేసి వారి సమ్మతితో భూ సేకరణ చేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకటాచారి, అసిస్టెంట్ కలెక్టర్ (ట్రైనీ) సచిన్ బస్వరాజ్ గుట్టూరు, ఆర్డీఓలు వాసుచంద్ర, అనిత, పవర్ గ్రిడ్ డీజీఏం దామోదర్ నాయుడు, తహసీల్దార్లు, పవర్ గ్రిడ్ అధికారులు పాల్గొన్నారు.
తహసీల్దార్‌కు సన్మానం
దోమ: తహసీల్దార్ రవీందర్‌ను కాంగ్రెస్ పార్టీ నేతలు మండల కేంద్రంలోని తహసీల్ కార్యాలయంలో బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. శాలువా కప్పి, సన్మానించారు. శుభాకాంక్షలు తెలిపారు. పీఏసీఎస్ చైర్మన్ యాదవరెడ్డి, నేతలు అంతిరెడ్డి పాల్గొన్నారు.
రైతులకు ఇబ్బంది కలిగించవద్దు
తాండూరు రూరల్: ఖరీఫ్ సీజన్‌లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలిగించవద్దని తాండూరు బ్లాక్ ఆత్మకమిటీ చైర్మన్ శంకర్‌రెడ్డి అన్నారు. బుధవారం ఎంపీడీఓ కార్యాలయంలో ఫర్టిలైజర్స్, ఫెస్టిసైడ్ డీలర్లు, వ్యవసాయ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎరువులు, విత్తనాలు రైతులకు అందుబాటులో ఉంచాలని సూచించారు. అధిక ధరలకు విక్రయించ వద్దని డీలర్లను ఆదేశించారు. తాండూరు ప్రాంతానికి యూరియా, డీఏపీ అధిక సంఖ్యలో స్టాక్ తెప్పించేందుకు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తానని పేర్కొన్నారు. ఏడీఏ అరుణ మాట్లాడుతూ.. ఎరువులు, విత్తనాలు అధిక ధరలకు విక్రయిస్తే లైసెన్స్‌లు రద్దు చేస్తామని హెచ్చరించారు. ఏఓలు కొమరయ్య, పవన్ ప్రీతం, శ్వేతరాణి, అనిత, డీలర్లు పాల్గొన్నారు.
అతివల భద్రత.. షీటీం బాధ్యత
తాండూరు: మహిళల భద్రత కోసమే షీటీం పని చేస్తోందని తాండూరు షీటీం బృందం పేర్కొంది. బుధవారం స్థానిక పాఠశాలలో బాలికల భద్రత గురించి అవగాహన కల్పించారు. చట్టాల గురించి వివరించారు. ప్రమాద సమయంలో 100 టోల్ ఫ్రి నంబర్ లేదా 181 కాల్ చేయాలని సూచించారు. పట్టణంలోని సీసీ కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు పరిసరాలను పర్యవేక్షిస్తామని, ఎవరైనా మహిళలు, బాలికలను వేధించినట్లు కనిపిస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో షీటీం సభ్యులు రోహిణి, ఉపాధ్యాయులు వెంకటేశ్, గణేషన్, తేజస్విని, నవనీత, కృష్ణవేణి తదితరులు ఉన్నారు.
28న బీఎల్‌ఓ,
బీఎల్‌ఓలకు శిక్షణ
డీఆర్‌ఓ స్వర్ణలత
ధారూరు: మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని బుధవారం జిల్లా రెవెన్యూ అధికారి స్వర్ణలత సందర్శించారు. బీఎల్‌ఓ, సూపర్‌వైజర్లతో సమావేశమైన ఎస్‌ఐఆర్‌పై సూచనలు చేశారు. ఈ నెల 28న బీఎల్‌ఓ, బీఎల్‌ఏలకు శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో తహసీలత్దార్ సాజిదాబేగం, డీటీ శ్రీలత, ఆర్‌ఐలు దేవేందర్‌రెడ్డి, స్వప్న తదితరులు పాల్గొన్నారు.


