కలెక్టర్ దీపక్ తివారి
అనంతగిరి: జిల్లాలో లక్ష్యాలకు అనుగుణంగా సీసీ రోడ్లు, అంగన్‌వాడీ భవనాలు, ఎస్‌హెచ్‌జీ భవన నిర్మాణాలు, స్కూల్ కాంపౌండ్ వాల్ పనులపై దృష్టి సారించి 100శాతం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ దీపక్ తివారి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాలు నుంచి అన్ని మండలాల ఎంపీడీఓలు, ఎంపీఓలు, డీఈ, ఏఈలతో వీడియో కాన్ఫరెన్సులో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో సీసీ రోడ్లు, ఎస్‌హెచ్‌జీ బిల్డింగ్స్, స్కూల్స్ కాంపౌండ్ వాల్స్, అంగన్‌వాడీ భవనాలు గ్రౌండింగ్ అయిన వాటిని 100శాతం పూర్తి చేసి ఎంబీ రికార్డ్ పూర్తి చేయాలన్నారు. ఇంతకుముందే మంజూరైన పనులను వెంటనే పూర్తి చేసి రిపోర్ట్ పంపించాలన్నారు. ఇప్పటికే మంజూరైన కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులు వేగవంతం చేయాలని పేర్కొన్నారు. ప్రతి మండలానికి ఇచ్చిన లక్ష్యం మేరకు అంగన్ వాడీ, గ్రామ పంచాయతీ బిల్డింగ్, ఎస్‌హెచ్‌జీ బిల్డింగ్ పనులపై దృష్టి సారించాలన్నారు. గ్రామాల్లో ఇంటి పన్నుపై ప్రత్యేక దృష్టి సారించి వంద శాతం పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్, ట్రైనీ కలెక్టర్ హర్ష చౌదరి, సీఈఓ సుధీర్, డీఆర్‌డీఓ శ్రీనివాస్, పంచాయతీరాజ్ ఈఈ ఉమేష్, పంచాయతీ అధికారి జయసుధ, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
వికారాబాద్ మార్కెట్లపై దృష్టి
స్పీకర్ గడ్డం ప్రసాద్‌తో రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి భేటీ
సాక్షి, హైదరాబాద్: వికారాబాద్ పరిధిలోని వ్యవసాయ మార్కెట్లపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు తెలిపారు. గురువారం రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి స్పీకర్‌ను ఆయన చాంబర్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా స్పీకర్ సొంత నియోజకవర్గమైన వికారాబాద్ జిల్లాలోని వ్యవసాయ మార్కెట్ల పరిస్థితులపై విస్తృతంగా చర్చించారు. జిల్లా వ్యవసాయ మార్కెట్ల పనితీరు, దళారుల దందా, అక్రమ వసూళ్లపై వచ్చిన ఫిర్యాదులపై ఆరా తీశారు. ఈ నేపథ్యంలో ఈ నెల 30న వికారాబాద్ వ్యవసాయ మార్కెట్లను సందర్శించనున్నట్లు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి చెప్పారు. మార్కెట్ యార్డుల్లో తూకాల్లో మోసాలు, అధిక కటింగ్‌లు, మార్కెట్ ఫీజుల పేరిట అధిక వసూళ్లు, వ్యాపారుల సిండికేట్ వ్యవస్థల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని కోదండరెడ్డి స్పీకర్‌కు వివరించారు. అలాగే, ఏఎంసీ మార్కెట్లలో రైతులకు కనీస సౌకర్యాలు కూడా అందుబాటులో లేవని పేర్కొన్నారు.
శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయం
అనంతగిరి: జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ ధ్యేయంగా పని చేయాలని ఎస్పీ స్నేహ మెహ్ర సిబ్బందిని ఆదేశించారు. ఆకస్మికంగా తలెత్తే మతపరమైన సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కోవడమే లక్ష్యంగా ఎస్పీ ఆధ్వర్యంలో పోలీసు అధికారులకు గురువారం ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యంగా మత అల్లర్లు తలెత్తినప్పుడు ఏమి చేయాలని అవగాహన కల్పించారు. రెచ్చగొట్టే ప్రసంగాలు, సామాజిక మాధ్యమాల్లో వచ్చే వదంతులను అరికట్టడం, పరిస్థితిని అదుపులోకి తెచ్చే క్రమంలో సంయమనం పాటిస్తూనే కఠినంగా వ్యవహరించడం ఎలాగో వివరించారు. బ్లూ కోట్స్, పెట్రో కార్ప్స్ సిబ్బంది సంఘటనా స్థలానికి అతి తక్కువ సమయంలో చేరుకుని, పరిస్థితిని ఉన్నతాధికారులకు ఎప్పటికప్పుడు వివరించాలని ఎస్పీ సూచించారు. అనంతరం జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన డెమో కార్యక్రమాన్ని ఆమె పర్యవేక్షించారు. కార్యక్రమంలో బ్లూ కోట్స్, పెట్రో కార్ప్స్ సిబ్బందితో పాటు జిల్లాలోని ఉన్నత పోలీసు అధికారులు, డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు తదితరులు పాల్గొన్నారు.
నేడు డయల్ యువర్ డీఎం
తాండూరు టౌన్: తాండూరు డిపో పరిధిలో శుక్రవారం డయల్ యువర్ డీఎం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు డిపో మేనేజర్ సురేశ్‌కుమార్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్న ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు 99592 26251 ఫోన్ నంబర్‌కు కాల్ చేసి తెలపాలని కోరారు. తాండూరు డివిజన్ పరిధిలోని ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ఆర్టిజన్ కార్మికుల ధర్నా
అనంతగిరి: ఆర్టిజన్ కార్మికులకు ఏపీఎస్‌ఈబీ సర్వీస్ రూల్స్ అమలు చేయాలని తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో గురువారం వికారాబాద్ డివిజన్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో నాణ్యమైన నిరంతర విద్యుత్ సరఫరా కోసం ప్రమాదాలను లెక్క చేయకుండా విధులు నిర్వహిస్తున్న ఆర్టిజన్లను విద్యుత్ సంస్థలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఆర్టిజన్ కార్మికులకు ఏపీఎస్‌ఈబీ రూల్స్ వర్తింపజేయాలని, విద్యార్హతల ఆధారంగా కన్వర్షన్ చేయాలని, కార్మికులందరినీ రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. విద్యుత్ సరఫరా సంస్థల్లో జీఓ నం.11 ప్రకారం పీస్ రేట్ కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించకుంటే ఏప్రిల్ 8 నుంచి సమ్మె సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు.


