శంకర్‌పల్లి: పట్టణంలోని వీర హనుమాన్ ఆలయంలో చోరీ జరిగిన సంఘటన శుక్రవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. శంకర్‌పల్లి సీఐ ముదస్సర్ అలీ తెలిపిన ప్రకారం.. మున్సిపల్ పరిధిలోని హనుమాన్‌నగర్ కాలనీలోని వీర హనుమాన్ ఆలయాన్ని శనివారం ఉదయం పూజారి హరిహరన్ తెరిచాడు. లోపల ఉన్న బీరువా తాళం పగిలిపోయి ఉండడంతో పాటు మిగతా సామగ్రి చిందరవందరగా పడిఉంది. వెంటనే ఆయన పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఆలయంలోని మూడు గంటలు, ఒక శఠగోపురం, పంచలోహా దుర్గమాత విగ్రహం, కొంత నగదు ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. దుండగుడు చోరీ చేస్తున్న దృశ్యాలు ఆలయంలోని సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. పూజారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


