భూ పరిశీలన చేసిన ఆర్డీఓ అనిత, తహసీల్దార్ కిషన్
దుద్యాల్: మండలంలోని హకీంపేట్‌లో ఆర్డీఓ కార్యాలయం ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శనివారం తాండూరు ఆర్డీఓ అనిత, తహసీల్దార్ కిషన్ గ్రామంలో పర్యటించారు. రైతు వేదిక పక్కన ఉన్న అసైన్డ్ భూములను పరిశీలించారు. పారిశ్రామిక వాడ కోసం ఇంకా 56 ఎకరాలు సేకరించాల్సి ఉంది. అయితే రైతులు పరిహారం తీసుకునేందుకు ముందుకు రాలేదు. దీంతో అధికారులు జనరల్ అవార్డు ప్రకటించారు. ఈ క్రమంలో భూ సేకరణకు సిద్ధమయ్యారు. ఇక్కడ పారిశ్రామిక వాడ, ఎడ్యుకేషన్ హబ్ ఏర్పాటు కానున్న తరుణంలో మరి కొన్ని ప్రధాన కార్యాలయాలు రానున్నాయి. ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇప్పటికే హకీంపేట్‌కు ఆర్డీఓ కార్యాలయాన్ని మంజూరు చేసింది. స్థల సేకరణ ప్రక్రియ పూర్తయిన వెంటనే భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ మహేశ్, కాంగ్రెస్ నాయకుడు నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


