బషీరాబాద్: తాండూరు మండలం గోనూరు నుంచి కాశీంపూర్‌కు ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను శుక్రవారం రాత్రి పోలీసులు పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. యాలాల మండలం పేర్కంపల్లికి చెందిన ఈడ్గి రాంచంద్రయ్య గౌడ్‌కు చెందిన ట్రాక్టర్, ఎనికేపల్లికి చెందిన కుమ్మరి కిష్టప్ప ట్రాక్టర్ అక్రమంగా ఇసుక రవాణా చేస్తుండగా పోలీసులు పట్టుకొని ఠాణాకు తరలించారు. డ్రైవర్లు ఈడిగి నరేష్, కుమ్మరి రమేష్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
తాగునీటి సమస్య రానివ్వం
బొంరాస్‌పేట: మండలంలోని రేగడిమైలారం ప్రజలకు వేసవిలో తాగునీటి సమస్య లేకుండా చేస్తామని సర్పంచ్ చిట్టెమ్మ, ఉప సర్పంచ్ దాసరి చంద్రప్ప తెలిపారు. శనివారం గ్రామంలో బోరుకు మోటారు బిగించి నీటి సరఫరాను ప్రారంభించారు. ఇది వరకు గ్రామంలో నూతనంగా కడా నిధులతో బోరువేసి పైపులైన్ చేశారు. కార్యక్రమంలో వీఎస్‌ఎస్ మాజీ చైర్మన్ వెంకట్‌రెడ్డి, పార్టీ గ్రామ అధ్యక్షుడు గుండప్ప, ఎస్‌ఎంసీ మాజీ చైర్మన్ అంజిలయ్య, మాజీ వార్డు సభ్యుడు శేఖరయ్య తదితరులు పాల్గొన్నారు.
ప్రేయసి పెళ్లికి
నిరాకరించిందని..
యువకుడి బలవన్మరణం
శంకర్‌పల్లి: ప్రాణంగా ప్రేమించిన ప్రేయసి పెళ్లికి నిరాకరించిందనే మనస్తాపంతో ఓ యువకుడు ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన మండల పరిధిలోని చెందిప్ప గ్రామంలో చోటు చేసుకుంది. సీఐ ముదస్సర్ అలీ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కొండా నర్సింలుకి ముగ్గురు కుమారులు ఉన్నారు. చిన్నవాడైన ప్రశాంత్ (24) నగరంలోని ఎంజీబీఎస్ బస్టాండ్‌లో ప్రైవేటు సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. మూడేళ్లుగా మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతితో ప్రేమలో ఉన్నాడు. ఇటీవల ఆ యువతిని పెళ్లి చేసుకుందాం అని అడిగే సరికి ఆమె నిరాకరించింది. దీంతో మనస్తాపానికి గురైన అతను శుక్రవారం రాత్రి ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటికి వెళ్లాడు. రాత్రి 10గంటలు దాటినా ఇంటికి రాకపోయే సరికి కుటుంబసభ్యులు చుట్టు పక్కల, బంధువుల వద్ద వెతికారు. చివరికి పొలంలోని మామిడి చెట్టుకి ఉరివేసుకొని కనిపించాడు. పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. శనివారం పోస్టుమార్టం తర్వాత మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
బంజారాహిల్స్: విధ్వంసక బ్యాటింగ్‌తో ‘కాటేరమ్మ కొడుకులు’గా ఐపీఎల్ అభిమానులు పిలుచుకునే సన్‌రైజర్స్ ఆటగాళ్లు నితీష్ కుమార్ రెడ్డి, అభిషేక్ శర్మ శనివారం జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మ తల్లిని దర్శించుకున్నారు. నగరానికి వీరు ఎప్పుడొచ్చినా పెద్దమ్మ తల్లిని దర్శించుకోవడం ఆనవాయితీ.


