కనిపిస్తే కబ్జా!
చర్యలు తీసుకుంటాం
తాండూరు: ప్రభుత్వ భూములు క్రమంగా కనుమరుగవుతున్నాయి. పట్టణ నడిబొడ్డున ఉన్న కాందిశీకుల స్థలం అక్రమ రిజిసే్ట్రషన్‌తో కబ్జా చేశారు. సర్వే నంబర్ 135లోని ప్రభుత్వ స్థలాన్ని అక్రమార్కులు అమ్ముకున్నారు. తాజాగా గొల్ల చెరువు ప్రాంతంలో సర్వే నంబర్ 111లో 14.14 ఎకరాలున్న భూమిలో రెండు ఎకరాల్లో సబ్ కలెక్టర్ కార్యాలయం కొనసాగుతుండగా.. మిగులు భూమిలో అక్రమ నిర్మాణాలు వెలిశాయి. సబ్ కలెక్టర్ కార్యాలయం పక్కన ఖాళీ స్థలాన్ని ఆక్రమించి షాపింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తున్నా సదరు డివిజన్ అధికారి పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది.
అధికారులు పట్టించుకోక..
మున్సిపల్ పరిధిలో పెద్ద ఎత్తున ప్రభుత్వ, దేవాదాయ శాఖ, వక్ఫ్ బోర్డు భూములున్నాయి. వీటిని రక్షించాల్సిన రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడంతో కబ్జాలపాలవుతున్నాయి. మున్సిపల్ పరిధిలోని 20, 21, 22, 23 మున్సిపల్ వార్డుల్లోని ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురయ్యాయి. గాంఽధీనగర్ ప్రాంతంలోని సర్వేనంబర్ 1–6 వరకు ఉన్న ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్నాయి. వినాయక చౌక్‌లోని విలువైన 484 చదరపు గజాల స్థలాన్ని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసిన విషయం విదితమే.
ఆగని అక్రమ నిర్మాణాలు
తాండూరు సబ్ కలెక్టర్ కార్యాలయ ప్రహరీని ఆనుకుని సర్వే నంబర్ 111లో ప్రభుత్వ భూమి ఉంది. మున్సిపల్, రెవెన్యూ అనుమతులు లేకుండానే అక్రమారర్కులు షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి పూనుకొన్నారు. ఇప్పటికే కార్యాలయ గేట్‌ను ఆనుకుని దుకాణ సముదాయం నిర్మించినా సదరు అధికారులు పట్టించుకోకపోవడంతో మరో నిర్మాణానికి తెరలేపారు. అదే సర్వే నంబర్‌లో కొనసాగుతున్న విజయ విద్యాలయ పాఠశాల భవనంతో పాటు రోడ్డు పక్కన ఖాళీ స్థలం విషయంలో వివాదం కొనసాగుతూనే ఉంది. గతేడాది రెవెన్యూ అధికారులు ప్రభుత్వ స్థలమంటూ బోర్డు ఏర్పాటు చేశారు. కబ్జాలో ఉన్న లీజుదారులు కోర్టును ఆశ్రయింయడంతో గతేడాది ఇంజక్షన్ ఆర్డర్ జారీ చేసింది. గత నెలలో కోర్టు ఆర్డర్ రద్దు చేసినా ఆక్రమణలు కొనసాగుతూనే ఉన్నాయి.
పరిశీలించిన అధికారులు
షాపింగ్ కాంప్లెక్స్ పనులను సబ్ కలెక్టర్ ఆదేశాల మేరకు తాండూరు మున్సిపల్ కమిషనర్ యాదగిరి, తాండూరు తహసీల్దార్ ధారాసింగ్ పరిశీలించారు. సర్వేనెంబర్ 111లో అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ నుంచి నిర్మాణాలకు తాము అనుమతులు ఇవ్వలేదని కమిషనర్ స్పష్టం చేశారు.
అన్యాక్రాంతమవుతున్న ప్రభుత్వ భూములు
అనుమతులు లేకుండానే నిర్మాణాలు
అధికారుల తీరుపై ఆరోపణలు
పట్టణంలో ప్రభుత్వ, కాందిశీకుల భూములు కబ్జాకు గురవుతున్న విషయమై రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో విచారణ చేయిస్తాం. పాత రికార్డులు పరిశీలిస్తాం. ప్రభుత్వ స్థలాలుగా తేలితే స్వాధీనం చేసుకుంటాం.
– ఉమాశంకర్ ప్రసాద్, సబ్ కలెక్టర్, తాండూరు
కనిపిస్తే కబ్జా!


