ముగిసిన మెథడిస్టు జాతర
● చివరి రోజు లక్షకు పైగా భక్తుల రాక
● గమ్యం చేరుకునేందుకు గంటల తరబడి నిరీక్షణ
● వాహనాల రద్దీతో ట్రాఫిక్‌కు అంతరాయం
● మేకలు, గొర్రెలు, కోళ్లకు వేలం
ధారూరు: ఆసియా ఖండంలోనే అత్యంత ప్రాముఖ్యమైన మెథడిస్ట్ క్రిస్టియన్ జాతర ఆదివారంతో ముగిసింది. ఒక్క రోజే లక్ష మందికి పైగా భక్తులు హాజరవడంతో జాతర ప్రాంగణం కిక్కిరిసింది. ప్రత్యేక ఆహ్వానితులుగా హైదరాబాద్, బెంగళూరు రీజినల్ కాన్ఫరెన్స్ బిషప్‌లు సీమొన్, డాక్టర్ అనిల్‌కుమార్ జాన్ సర్వాండ్ దైవ సందేశం ఇచ్చారు. ఆరు రోజులు పాటు నిర్వహించిన జాతరకు తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల నుంచి 12 లక్షల మంది వరకు భక్తులు విచ్చేసినట్లు జాతర కార్యదర్శలు సెబాస్టిన్ రవికుమార్ తెలిపారు. వాహనాల రద్దీ కారణంగా ట్రాఫిక్ సమస్య తలెత్తింది. సీఐ రఘురాంతో పాటు బందోబస్తుకు వచ్చిన పోలీసులు పార్కింగ్ స్థలాలను పెంచి వాహనాలను జాతర ప్రాంగణంలోకి రాకుండా చర్యలు తీసుకున్నారు.
ప్రైవేటు వాహనాలే దిక్కు
మధ్యాహ్నం నుంచే జాతర నుంచి భక్తులు వెనుదిరిగారు. ఆర్టీసీ సర్వీసులు సరిపడా అందక ప్రైవేటు వాహనాలను ఆశ్రయించారు. కర్ణాటక, మహారాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు రైళ్ల కోసం గంటల తరబడి నిరీక్షించారు. ధారూరు రైల్వే స్టేషన్ ప్రాంగణం జాతరను తలపించింది. బీదర్ నుంచి వచ్చే ప్రత్యేక రైలు లేకపోవడం, యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్ మాత్రమే ఆగివెళ్లింది. రైళ్లు దొరకని భక్తులు తరువాత రోజు వచ్చే రైళ్ల కోసం ఫ్లాట్‌ఫాంల పైనే నిరీక్షిస్తున్నారు.
జీవాలకు వేలం
జాతరకు వచ్చిన తమ కోర్కెలు తీరిన, కోరుకున్న కోర్కెలు తీరాలని మొక్కుకున్న భక్తులు మేకలు, గొర్రెలు, కోళ్లు, వెండి, బంగారు నగలు దానంగా జాతర కమిటీకి ఇచ్చారు. సాయంత్రం మేకలు, గొర్రెలు, కోళ్లను వేలం వేసి విక్రయించారు. ఇందుకు భక్తులు క్రీస్తు ప్రసాదం దక్కించుకునేందుకు పెద్ద ఎత్తున పోటీ పడ్డారు. కొనుగోలు చేసిన భక్తులు తిరిగి వాటిని తమ పేరిట దానం చేస్తున్నట్లు కమిటీకి తిరిగి ఇచ్చేశారు. జాతరలో ఏర్పాటు చేసిన హుండీలను వికారాబాద్‌కు తరలించారు.
ముగిసిన మెథడిస్టు జాతర


