న్యూస్‌రీల్
నియోజకవర్గాలకు చేరిన చీరల వివరాలు
సోమవారం శ్రీ 17 శ్రీ నవంబర్ శ్రీ 2025
ఇందిరమ్మ చీరలు..
వికారాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా బతుకమ్మ కానుకగా చీరలు పంపిణీ చేసేందుకు రంగం సిద్ధం చేసినప్పటికీ పలు కారణాలతో వాయిదా పడింది. నాటి నుంచి జిల్లా గోదాములోనే మగ్గుతున్నాయి. ఈ నెల 19న మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి రోజున వీటిని పంపిణీ చేయాలని సర్కార్ యోచిస్తోంది. గత ప్రభుత్వం బతుకమ్మ చీరలు పంపిణీ చేయగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తొలి ఏడాది పంపిణీ చేయలేదు. ఈ ఏడాది ఇచ్చేందుకు చీరలను గోదాముల్లోకి చేర్చారు. అవి సరిపడా రాలేదని.. ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల కోడ్, తదనంతరం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తదితర కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది. త్వరలో లోకల్ బాడీ ఎలక్షన్స్ నిర్వహించాలని కసరత్తు చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఎన్నికల కోడ్ సైతం లేకపోవడంతో ఇందిరా గాంధీ జయంతి రోజున పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మరో రెండు రోజులే సమయం ఉందని.. సరిపడా చీరలు అందలేదని వాయిదా వేస్తారా..? పంపిణీ చేస్తారా అనే చర్చలు వినిపిస్తున్నాయి.
ఒక్కో చీరకు రూ.480
కాంగ్రెస్ ప్రభుత్వం పంపిణీ చేయనున్న చీరలు నాణ్యతో ఉంటాయని ప్రకటించింది. గత ప్రభుత్వం ఒక్కో చీరకు రూ.350 వెచ్చించగా ప్రస్తుతం రూ.480 ఇస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే చీరలు నియోజకవర్గ కేంద్రాలకు చేరగా అక్కడ నుంచి మండల కేంద్రాలు, గ్రామాలకు చేరవేసేందుకు కసరత్తు చేస్తున్నారు. వీటి పంపిణీకి గ్రామానికి ముగ్గురు చొప్పున ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేస్తున్నారు. వీరితో పాటు రేషన్ డీలర్లు, ఐకేపీ, మెప్మా అధికారులు ఈ ప్రక్రియలో కీలకంగా వ్యవహరించనున్నారు.
అందుబాటులో 50 శాతమే
జిల్లా ఓటరు జాబితా ఆధారంగా 3,54,912 మంది మహిళలుండగా చీరలు పలువురు స్వీకరించేందుకు అనాసక్తి చూపడంతో అవి మిగిలిపోతున్నాయి. దీంతో గత గణాంకాలను పరిగణలోకి తీసుకుని 2,73,000 చీరలు అవసరమని నిర్ధారించి పంపిణీ చేశారు. ఈ ఏడాది 1,93,065 చీరలు పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఇందులో ఇప్పటి వరకు 50 శాతం చీరలు నియోజకవర్గ కేంద్రాల్లోని గోదాములకు చేరాయి. జిల్లాకు చేరిన చీరలు మొత్తం పరిగి ఇండోర్ స్టేడియం, తాండూరు సమీపంలోని ఖాంజాపూర్ వ్యవసాయ మార్కెట్ గోదాముల్లో నిల్వ ఉంచారు. పరిగి ఇండోర్ స్టేడియం నుంచి పరిగి మున్సిపాలిటీ, బొంరాస్‌పేట్ మండలాలకు తరలిస్తుండగా ఖాంజాపూర్ గోదాం నుంచి తాండూరు, కొడంగల్ మండలాలు, మున్సిపాలిటీలతో పాటు మరో నాలుగు మండలాలకు చీరలు తరలిస్తున్నారు. వీటిని స్వయం సహాయ సంఘాల సభ్యులకు మాత్రమే పంపిణీ చేయనున్నట్లు సమాచారం. బతుకమ్మ చీరల పంపిణీలో ఎదురైన అనుభవాలను అధికారులు పరిగణలోకి తీసుకుంటారా.. అవే సమస్యలు పునరావృతం చేస్తారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా కేవలం స్వయం సహాయక సంఘాల్లో సభ్యులకు మాత్రమే పంపిణీ చేస్తే మిగిలిన వారి నుంచి విమర్శలు వచ్చే అవకాశం ఉందని జంకుతున్నారు.
19న ఇందిరాగాంధీ జయంతి రోజు అందజేసేందుకు కసరత్తు
గోదాముల నుంచి మండల కేంద్రాలకు సరఫరా చేస్తున్న అధికారులు
ఈ ఏడాది మహిళా సంఘాల సభ్యులకు మాత్రమే
నియోజకవర్గం చీరల సంఖ్య
వికారాబాద్ 59,443
పరిగి 48,028
తాండూరు 56,198
కొడంగల్ 29,396
పంపిణీకి ఏర్పాట్లు
పంపిణీకి ఏర్పాట్లు
పంపిణీకి ఏర్పాట్లు
పంపిణీకి ఏర్పాట్లు


