జర్నలిస్టులు సమాచార వారధులు
● త్వరలో వారి సమస్యలు పరిష్కారం
● మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
శంకర్‌పల్లి: జర్నలిస్టులు సమాచార వారధులని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ఇటీవల హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం అధ్యక్షుడు విజయ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారంశంకర్‌పల్లి మండలం ప్రొద్దుటూరులోని ఎక్స్‌పీరియం ఎకో ఫ్రెండ్లీ పార్కులో ‘ప్రెస్‌క్లబ్ ఫ్యామిలీ గెట్ టు గెదర్’ ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గాయకులు నల్లగొండ గద్దర్, విమలక్క, మంగ్లీ తమ మాటలు, పాటలతో అలరించారు. సాంస్కృతిక నృత్యాలు కట్టిపడేశాయి. అనంతరం మంత్రి కోమటిరెడ్డి నూతనంగా ఎన్నికై నా ప్రెస్‌క్లబ్ కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపి, శాలువాలతో ఘనంగా సన్మానించారు. ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడిగా ఎన్నికై న విజయ్‌కుమార్‌రెడ్డి తన చిన్ననాటి మిత్రుడని, తమ కుటుంబసభ్యుడని, ఆయన ఆధ్వర్యంలో ప్రెస్‌క్లబ్ మరింత అభివృద్ధి చెందుతుందని ఆకాంక్షించారు. జర్నలిస్టులు వార్తలు సేకరించే క్రమంలో తమ కుటుంబంతో గడిపే సమయం ఉండదని, ఇలా సమయం కేటాయించి, అంతా ఒక్కచోటే చేరడం సంతోషాన్ని కలిగిస్తోందన్నారు. ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉందని, దీనిపై సీఎం రేవంత్‌రెడ్డి నుంచి త్వరలోనే మంచి నిర్ణయాలు రాబోతున్నాయని వెల్లడించారు. ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు విజయ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రెస్‌క్లబ్ అభివృద్ధికి, ప్రెస్‌క్లబ్ భవనాన్ని క్లబ్‌కే ఉండేలా చూడాలని మంత్రిని కోరారు. వెంటనే స్పందించిన ఆయన సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి, క్లబ్‌కే దక్కేలా చూస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సినీ నటులు మంచు మనోజ్, సాగర్, ప్రెస్‌క్లబ్ జనరల్ సెక్రెటరీ రమేశ్, ఉపాధ్యక్షులు రాజేశ్, అరుణ, కోశాధికారి రమేశ్ వైట్ల, జాయింట్ సెక్రెటరీలు హరిప్రసాద్, బాపురావు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


