నిందితులను కఠినంగా శిక్షించాలి
షాద్‌నగర్‌రూరల్: పరువు పేరుతో దళిత యువకుడిని దారుణంగా హతమార్చిన నిందితులను కఠినంగా శిక్షించాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్రప్రధాన కార్యదర్శి రాగళ్ల ఉపేందర్ డిమాండ్ చేశారు. ఫరూఖ్‌నగర్ మండలం ఎల్లంపల్లి గ్రామంలో కులాంతర వివాహానికి సహకరించారని రాజశేఖర్ అనే యువకుడిని పెట్రోల్ పోసి హతమార్చిన సంగతి తెలిసిందే. మృతుడి కుటుంబ సభ్యులను ఆదివారం రాగళ్ల ఉపేందర్ ఎంఆర్‌పీఎస్ జిల్లా అధ్యక్షుడు పెంటోళ్ల నర్సింహతో కలిసి పరామర్శించారు. ఘటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఉపేందర్ మాట్లాడుతూ.. కుల దురహంకారాన్ని నిండా నింపుకొని అమాయ దళిత యువకుడిని దారుణంగా హతమార్చడం శోచనీయమని అన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఏళ్లు గడుస్తున్నా ఇంకా పరువు హత్యలు కొనసాగడం విచారకరమన్నారు. హత్యకు పాల్పడిన పాత్రదారులు, సూత్రధారులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలన్నారు. మృతుడి కుటుంబ సభ్యులకు ఉద్యోగం కల్పించాలని, రూ.25 లక్షల పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.


