కొన్నది పిసరంతే! | - | Sakshi
Sakshi News home page

కొన్నది పిసరంతే!

Nov 18 2025 8:31 AM | Updated on Nov 18 2025 8:31 AM

కొన్నది పిసరంతే!

కొన్నది పిసరంతే!

పత్తి కొనుగోలు కేంద్రాల మూసివేతపై రైతుల ఆందోళన

వికారాబాద్‌: జిల్లాలో పత్తి కొనుగోళ్ల ప్రక్రియ పూర్తి కాకుండానే ప్రభుత్వం కేంద్రాలను మూసివేయడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. సెంటర్లు ప్రారంభించి నెల దాటినా టార్గెట్‌లో కేవలం ఐదు శాతం కూడా సేకరించలేదు. ఈలోగా సీసీఐ కేంద్రాలను మూసి వేస్తున్నట్లు ప్రకటించడంతో అన్నదాతలు హైరానా పడుతున్నారు. కొనుగోళ్ల ప్రక్రియ ఊపందుకునే సమయంలో సెంటర్లను మూసి వేయడం అన్నదాతలకు శాపంలా మారింది. ప్రభుత్వ మద్దతు ధర రూ. 8,110 కాగా బహిరంగ మార్కెట్‌లో రూ.6 వేల వరకే ధర ఉంది. ఇలాంటి సమయంలో కేంద్రాలను మూసివేస్తే భారీగా నష్టపోవాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. భారీ వర్షాలకు పంట దాదాపు దెబ్బతిని అప్పుల ఊబిలో కూరుకుపోయామని పేర్కొన్నారు. సోమవారం నుంచి కొనుగోలు కేంద్రాలను మూసివేశారు. ఇకపై తెరుస్తారా అన్నది సందేహంగానే ఉంది. గతంలో కూడా పదేపదే కేంద్రాలను మూసివేయడంతో రైతులు ఇబ్బందులు పడ్డారు. కొర్రీల కారణంగా రైతులు కొనుగోలు కేంద్రాలకు పంట తీసుకెళ్లడానికి జంకుతున్నారు. ఈ క్రమంలో దళారులను ఆశ్రయించి నష్టపోతున్నారు. కేంద్రాలకు దిగుబడి పోటెత్తుతున్న సమయంలో సెంటర్లను మూసి వేయడం విమర్శలకు తావిస్తోంది.

కొర్రీలతో అవస్థలు

జిల్లాలో పత్తి కొనుగోలు లక్ష్యం బారెడు, సేకరణ మూరెడు అన్న చందంగా తయారైంది. తాండూరు ప్రాంతంలో మూడు, వికారాబాద్‌, పరిగి ప్రాంతాల్లో రెండేసి చొప్పున, మర్పల్లి, కోట్‌పల్లి, ధారూరు, కొడంగల్‌లో ఒక్కొక్కటి చొప్పున కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. కేంద్ర ప్రభుత్వం క్వింటాలుకు రూ.8110 మద్దతు ధర ప్రకటించింది. ప్రైవేటు వ్యాపారులు, జిన్నింగ్‌ మిల్లులు, బహిరంగ మార్కెట్‌లో క్వింటాలుకు రూ.4,500 నుంచి రూ.6,400 వరకు మాత్రమే చెల్లిస్తున్నారు. దీంతో రూ.2 వేల నుంచి రూ.3వేల వరకు నష్టపోతున్నారు. అయితే కొనుగోలు కేంద్రాల్లో కొర్రీలు, ప్రైవేటులో డబ్బులు వెంటనే ఇస్తుండటంతో వారు వారికే విక్రయిస్తున్నారు. సీసీఐ కేంద్రాల్లో తేమ శాతం 8 కంటే ఎక్కువగా ఉంటే ధరలో కోత విధింస్తున్నారు. 12శాతం కంటే ఎక్కువగా ఉంటే కొనుగోలు చేయడంలేదు. ఎనిమిది శాతం కంటే ఎక్కువ ఉంటే ఒక్కో శాతానికి రూ.వంద చొప్పున తగ్గించి ఇస్తున్నారు. అంతేకాకుండా పొట్టిపింజ, పొడుపు పింజ రకం అనే తేడాలతో ధరలు తగ్గిస్తున్నారు. వాతావరణ పరిస్థితుల కారణంగా కొద్దిగా రంగు మారినా తిప్పి పంపుతున్నారు. ఈ కారణాల వల్ల రైతులు కొనుగోలు కేంద్రాలకు పత్తి తీసుకెళ్లడం లేదు. వేల రూపాయల నష్టం వచ్చినా ప్రైవేటుకే మొగ్గు చూపుతున్నారు.

జిల్లాలో పత్తి సాగు 2.46లక్షల ఎకరాలు

దిగుబడి అంచనా 2.68 మెట్రిక్‌ టన్నులు

సేకరించింది మాత్రం 8 వేల మెట్రిక్‌ టన్నులే..

కొర్రీలతో ఆసక్తి చూపని అన్నదాతలు

ప్రైవేటుకే మొగ్గు

12 మిల్లుల ద్వారా..

జిల్లా వ్యాప్తంగా 5లక్షల ఎకరాల్లో ఆయా పంటలు సాగువుతాయి. సింహ భాగం పత్తి పంటదే. 1,25,000 మంది 2,46,725 ఎకరాల్లో పత్తి సాగు చేస్తున్నారు. ఎకరాకు సగటున 10 క్వింటాళ్ల చొప్పున 2,68,282 మెట్రిక్‌ టన్నుల దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. ఈ మొత్తం కొనుగోలు చేయాలని నిర్ణయించారు. జిల్లాలో 14 కాటన్‌ మిల్లులు ఉండగా 12 మిల్లులకు అనుమతి ఇచ్చారు. వీటి ద్వారా 8వేల మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement