ఇదేం బోధన?
కుల్కచర్ల: ‘విద్యార్థులకు కనీస లెక్కలు కూడా రావడం లేదు.. ఏం బోధన చేస్తున్నారు.. ఇలాగేనే పాఠాలు చెప్పేది.. పని చేయకుంటే చర్యలు తప్పవు’ అని డీఈఓ రేణుకాదేవి ఉపాధ్యాయులను హెచ్చరించారు. సోమవారం కుల్కచర్లలోని జెడ్పీ బాలుర పాఠశాలను సందర్శించారు. పదో తరగతి విద్యార్థులకు పలు పాఠ్యాంశాలపై ప్రశ్నలు వేశారు. వారు సరైన సమాధానాలు చెప్పకపోవడంతో టీచర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గణితం సబ్జెక్టులో విద్యార్థులు చాలా పూర్‌గా ఉన్నారని, ఇలా ఉంటే చాలా కష్టమని అసహనం వ్యక్తం చేశారు. మరో మూడు నెలల్లో పరీక్షలు ఉన్నందున మెరుగైన ఫలితాలు ఎలా వస్తాయని నిలదీశారు. ఉత్తీర్ణత శాతం తగ్గితే ఉపాధ్యాయులదే బాధ్యత అని హెచ్చరించారు. స్పెషల్ క్లాసులు తీసుకోవాలని ఆదేశించారు. గణితం ఉపాధ్యాయుడికి ఇంక్రిమెంట్ కట్ చేయాలని ఎంఈఓ హబీబ్ అహ్మద్‌కు సూచించారు. మధ్యాహ్న భోజనం మరింత బాగుండాలని వంట సిబ్బందికి చెప్పారు. తాగునీటి ట్యాంక్‌ను మరో చోటికి మార్చాలన్నారు. విద్యార్థులు చదువుపైనే దృష్టి కేంద్రీకరించాలని పేర్కొన్నారు. మరో నెల రోజుల్లో పాఠశాలకు వస్తామని అప్పటిలోగా విద్యార్థుల సామర్థ్యాలు మెరుగుపడాలని ఆదేశించారు. కార్యక్రమంలో సీఆర్పీ మైపాల్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులకు లెక్కలు కూడా రావా?
పాఠాలు చెప్పే పద్ధతి ఇదేనా?
ఉపాధ్యాయుల పనితీరుపై డీఈఓ రేణుకాదేవి ఆగ్రహం
సరిగ్గా పనిచేయకుంటే చర్యలు తప్పవని హెచ్చరిక


