మార్గం సుగమం
విజయం సాధించాం
పనులు వేగంగా చేపట్టాలి
● తొలగిన అడ్డంకులు
● గ్రీన్‌ట్రీబ్యునల్‌లో స్టే ఎత్తివేత
● హైదరాబాద్–బీజాపూర్ హైవే విస్తరణకు లైన్ క్లియర్
● సమస్యకు దొరికిన పరిష్కారం
● నెరవేరిన పర్యావరణ ప్రేమికుల ఆశయం
ఎన్నో ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. హైదరాబాద్–బీజాపూర్ నేషనల్ హైవే విస్తరణకు ‘గ్రీన్’ సిగ్నల్ వచ్చింది. అటు రహదారి విస్తరణకు ‘మార్గం’ సుగమం కావడంతో పాటు ఇటు పర్యావరణ ప్రేమికుల ఆశయం నెరవేరనుంది. ప్రయాణికుల పాట్లు తొలగిపోనున్నాయి.
చేవెళ్ల: హైదరాబాద్ నుంచి బీజాపూర్ వరకు ఉన్న రోడ్డును 2015లో కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారిగా ప్రకటించింది. ఇందులో భాగంగా పోలీస్ అకాడమీ (అప్పా) నుంచి మన్నెగూడ వరకు 46.405 కి.మీ. రోడ్డును నాలుగు వరుసలుగా విస్తరించే బాధ్యతను ఎన్‌హెచ్‌ఏఐకి కేంద్రం అప్పగించింది. నిర్మాణానికి 928.41 కోట్లు కేటాయించింది. దీనికి 145.42 హెక్టార్ల భూసేకరణ పూర్తి చేశారు. 18 అండర్‌పాస్‌లు, రెండు బైపాస్ రోడ్లతో రోడ్డు విస్తరణ చేయాల్సి ఉంది. అప్పా నుంచి మన్నెగూడ వరకు రోడ్డుకు ఇరువైపులా ఉన్న మర్రి వృక్షాలు తొలగించాల్సి రావడంతో పర్యావరణ ప్రేమికులు అభ్యంతరం తెలిపారు. రోడ్డు పక్కన ఉన్న 915 మర్రి చెట్లను పరిరక్షించాలని, వేరే రోడ్డు వేసుకోవాలంటూ గ్రీన్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. దీంతో రోడ్డు విస్తరణకు బ్రేక్‌లు పడ్డాయి.
ఎట్టకేలకు పరిష్కారం
ఏళ్లనాటి మర్రి చెట్ల తొలగింపునకు పర్యావరణ ప్రేమికులు ససేమిరా అనడంతో ఏళ్లుగా కేసు కొనసాగుతూ వచ్చింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్‌రెడ్డి నేషనల్ హైవే అధికారులతో చర్చించి పరిష్కారం చూపించాలని సూచించారు. చెట్లు తొలగించకుండా రోడ్డు నిర్మాణం చేసే విధంగా ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు నివేదిక ఇచ్చా రు. 915 మర్రి చెట్లలో 150 చెట్లను రీలొకేట్ చేసి మిగతా 765 చెట్లను అలాగే ఉంచి రోడ్డు వేయను న్నట్లు తెలిపారు. దీనిపై పర్యావరణ ప్రేమికులతో సైతం చర్చలు జరిపి ఒప్పించారు. ఈ క్రమంలో గతనెల 31న గ్రీన్ ట్రిబ్యునల్‌లో కేసు విచారణలో అధికారులు సమర్పించిన నివేదికలతో విస్తరణపై ఉన్న స్టే ఎత్తివేశారు. దీంతో రోడ్డు విస్తరణకు ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి. ఇప్పటికే చేవెళ్ల, మొయినాబాద్‌లో రెండు బైపాస్‌రోడ్డు పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇక ప్రధాన రోడ్డు విస్తరణ పనులను సైతం వెంటనే ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. విస్తరణ పూర్తయితే ప్రమాదాలను నివారించడంతోపాటు ప్రయాణం సాఫీగా సాగే అవకాశం ఉంది. గ్రీన్ ట్రిబ్యునల్‌లో స్టే తొలగిపోయి విస్తరణకు పరిష్కారం లభించడంతో వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
రహదారి విస్తరణకు అడ్డంకులను తొలగించేందుకు చేయని ప్రయత్నం లేదు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రత్యేక చొరవతో త్వరగా పరిష్కారం దొరికింది. పర్యావరణ ప్రేమికులతో అనేకసార్లు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి, నేను సంప్రదింపులు జరిపాం. కోర్టులో స్టే తొలగిపోయింది. ఇక రోడ్డు పనులు ముందుకు సాగుతాయి.
– కాలె యాదయ్య, ఎమ్మెల్యే, చేవెళ్ల
రహదారి విస్తరణపై ఉన్న కేసు తొలగిపోవడం సంతోషకరం. కేంద్రం నిధులు విడుదల చేసిన రోడ్డు పనులను ఇప్పటికై నా ఆగకుండా కాంట్రాక్టర్‌తో త్వరగా చేయించాలి. ఏళ్లతరబడి నిర్మాణ పనులు కొనసాగిస్తే మళ్లీ ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతాయి. దీనిపై పాలకులు, ఈప్రాంత నాయకులు కృషి చేయాలి.
– అత్తెల్లి అనంత్‌రెడ్డి, బీజేపీ చేవెళ్ల మున్సిపల్ అధ్యక్షుడు


