పారిశ్రామిక వాడకు రేడియల్ రోడ్డు
● శంషాబాద్–లగచర్లకు వంద ఫీట్ల మార్గం!
● కొనసాగుతున్న ఏరియల్ సర్వే
దుద్యాల్: మండల పరిధిలోని హకీంపేట్, లగచర్ల, పోలేపల్లి, రోటిబండ తండా, పులిచర్ల కుంట తండాల పరిసర ప్రాంతాల్లో పారిశ్రామిక వాడ ఏర్పాటు చేస్తున్న విషయం విదితమే. ఇందుకు ప్రభుత్వం ఆయా గ్రామాల రైతుల నుంచి 1,270 ఎకరాల అసైన్డ్, పట్టా భూములు సేకరించి పరిహారం అందించింది. త్వరలో పరిశ్రమల ఏర్పాటుకు శంకుస్థాపనలు చేయనున్న నేపథ్యంలో శంషాబాద్ నుంచి నేరుగా లగచర్ల పారిశ్రామిక వాడ వరకు వంద ఫీట్ల రేడియల్ రోడ్డును నిర్మించేందుకు ప్రభుత్వం సన్నహాలు చేస్తోంది. రెండు రోజుల క్రితం పరిగి నియోజవకర్గంలో ఏరియల్ సర్వే చేసినట్లు సమాచారం. ఈ రోడ్డు నిర్మాణానికి దాదాపు 1,800 ఎకరాల భూమి అవసరం పడుతుందనే చర్చలు వినిపిస్తున్నాయి. ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే పారిశ్రామిక వాడ నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు ఒక గంటలో చేరుకోవచ్చు.


