అధికారులపై చర్యలు తీసుకోవాలి
పట్టణ నడిబొడ్డున ఉన్న ప్రభుత్వ భూమిని అన్యాక్రాంతం చేస్తూ కబ్జాకు పాల్పడిన వ్యక్తులతో పాటు సహకరించిన సంబంధిత అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం సీపీఎం, కేవీపీఎస్, తెలంగాణ మైనార్టీ హక్కుల పోరాట సమితి, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ హక్కుల పోరాట సమితి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కె.శ్రీనివాస్, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి ఉప్పలి మల్కయ్య, నాయకుడు చంద్రయ్య మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఇల్లు, దుకాణాల స్థలాన్ని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసిన తాండూరు సబ్ రిజిస్ట్రార్‌తో పాటు మున్సిపాలిటీలో ఇంటి నంబర్ ఇచ్చి అసెస్‌మెంట్ చేసిన అప్పటి ఇన్‌చార్జి కమిషనర్‌పై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. అధికార పార్టీ నేతల అండదండలతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాత్రికి రాత్రే కూల్చివేతలు చేపట్టినా అధికారులు పట్టించుకోకపోవడం సరికాదన్నారు. ఈ విషయమై కలెక్టర్, మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. అక్రమ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసి కాందిశీకుల స్థలాన్ని స్వాధీంనం చేసుకోవాలని లేదంటే ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు నర్సింలు, కృష్ణ, ఎల్లప్ప తదితరులు పాల్గొన్నారు.


