అభివృద్ధి పనులకు శ్రీకారం
శ్రీవారి ఆలయ విస్తరణకు భూమిపూజ
● రూ.110 కోట్లతో చేపట్టనున్న నిర్మాణాలు
కొడంగల్: పట్టణంలోని శ్రీ మహాలక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయ విస్తరణకు ధర్మకర్తలు ఆదివారం భూమి పూజ చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం వైఖానస ఆగమ శాస్త్ర ముఖ్య సలహాదారు, దివంగత సుందర వరద భట్టాచార్యుల కుమారులు కొడంగల్‌లో శ్రీవారి ఆలయ పునఃనిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. వైఖానస ఆగమ శాస్త్రోక్తంగా ఆలయ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం ముందుకు వచ్చింది. రూ.110 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేయనున్నట్లు ఆలయ ధర్మకర్తలు తెలిపారు. రాష్ట్ర దేవాదాయ శాఖ, తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు జరుగుతాయి. రెండేళ్ల లోపు ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులు పూర్తి చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు, వాస్తు నిపుణులు ప్రణాళికలు సిద్ధం చేశారు.
సీఎం ప్రత్యేక చొరవ
ఆలయ అభివృద్ధికి సీఎం ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఆలయాన్ని విస్తరించి మౌలిక సదుపాయాలు కల్పిస్తారు. తిరుమల తరహాలో వైఖానస ఆగమ శాస్త్రోకంగా అభివృద్ధి చేస్తారు. క్యూలైన్, కల్యాణ మండపం, కల్యాణ కట్ట, పూజా మందిరాలు, వసతి గదులు, స్నాన ఘట్టాలు, మరుగుదొడ్లు, పార్కింగ్, పుష్కరిణి, ప్రసాదం కౌంటర్లు తదితర వాటికి నూతన భవనాలు నిర్మిస్తారు. శ్రీవారి ఉత్సవాలు, బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉత్సవమూర్తుల ఊరేగింపు కోసం మాడ వీధులను ఏర్పాటు చేస్తారు. దేవాలయ జీర్ణోద్ధరణ పనుల్లో భాగంగా వివిధ పనులకు సంబంధించిన నక్షలను రూపొందించారు. 8,736 గజాల స్థలం సేకరించి అన్ని వసతులు, సౌకర్యాలతో అభివృద్ధి చేయనున్నారు. ఇండ్లు కోల్పోతున్న వారికి ప్రత్యేక ప్యాకేజీతో పరిహారం చెల్లిస్తున్నారు. భూమి పూజ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు నందారం శ్రీనివాస్, రత్నం, ప్రశాంత్, రాజు, మధు, మాజీ ఎంపీపీ ముద్దప్ప దేశ్‌ముఖ్, మున్సిపల్ మాజీ వైస్ చైర్ పర్సన్ ఉషారాణి, మాజీ కౌన్సిలర్లు శంకర్‌నాయక్, మధుయాదవ్, ఈఓ రాజేందర్‌రెడ్డి, లయన్స్‌క్లబ్ అధ్యక్షుడు మురహరి వశిష్ట, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఘనంగా కై శిక ద్వాదశి
శ్రీవారి ఆలయంలో ఆదివారం ఉదయం కై శిక ద్వాదశి ఆస్థానం నిర్వహించారు. శ్రీ ఉగ్ర శ్రీనివాసమూర్తి ఉభయ నాంచారులతో కలిసి మాడ వీధులలో ఊరేగారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని ఆస్థాన మండపంలో వేంచేసి పురాణ పఠనంతో ఆరాధించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.


