డబుల్ డౌటేనా!
పూర్తికావొచ్చిన నిర్మాణాలు
వికారాబాద్: డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాల్లో తీవ్ర జాప్యం ఏర్పడగా పూర్తయిన ఇళ్లు అర్హులకు పంచడంలోనూ అంతకు రెండింతల జాప్యం చేస్తున్నారు. రెండేళ్ల క్రితం కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం వారి మేనిఫెస్టోలో ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని పేర్కొన్న విషయం విదితమే. ఇప్పటికే లబ్ధిదారులను ఎంపిక చేసిన సర్కారు ఇళ్ల నిర్మాణాలు సైతం శరవేగంగా చేపడుతోంది. ఏడాది క్రితం డబుల్ బెడ్రూం ఇళ్లను సైతం కేటాయిస్తామని హడావుడి చేసిన అధికారులు ఆ తరువాత వాటి ఊసెత్తటంలేదు. నిర్మాణాలు పూర్తయిన ఇళ్లలో ఏమైన మరమ్మతులు ఉంటే పూర్తి చేయాలని అధికారులకు సూచించిన కలెక్టర్ ఆతర్వాత మిన్నకుండిపోయారు. దీంతో పూర్తయిన ఇళ్లు లబ్ధిదారులకు ఎప్పుడు కేటాయిస్తారనే విషయంలో స్పష్టత కరువైంది. గతంలో స్వీకరించిన దరఖాస్తుల ప్రకారమే కేటాయిస్తారా..? లేదంటే కొత్తగా లబ్ధిదారులను ఎంపిక చేస్తారా..? అనే విషయంలో సందిగ్ధత నెలకొంది. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్ల విషయంలో అధికారికంగా ఏ ప్రకటన రాకపోవడంతో డబుల్ బెడ్రూం ఇళ్ల కథ కంచికేనా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయా గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో ఇప్పటికే దరఖాస్తులు స్వీకరించి రెండుసార్లు విచారణ సైతం పూర్తి చేశారు. కాగా గత ప్రభుత్వం మాదిరిగానే కాంగ్రెస్ ప్రభుత్వం సైతం ఏ నిర్ణయం తీసుకోవడం లేదు. ఇళ్లు పాడవకముందే లబ్ధిదారులను గుర్తించి పంపిణీ చేయాలని ఇళ్లు లేని పేదలు కోరుతున్నారు.
దరఖాస్తుల విచారణ పూర్తి
దరఖాస్తులను విచారించి అర్హులను గుర్తించేందుకు ఆయా శాఖల అధికారులు, సిబ్బందితో ముగ్గురు చొప్పున టీంలను ఏర్పాటు చేశారు. ఈ టీంలు వార్డుల వారీగా ఇంటింటికీ వెళ్లి విచారించారు. ఇందులో 50 శాతం మాత్రమే అర్హులు ఉన్నట్లు గుర్తించారు. జిల్లాలో 1,031 ఇళ్ల నిర్మాణాలు తుది దశకు చేరుకున్నాయి. అందుబాటులో ఉన్న ఇళ్లకు పదింతలు ఎక్కువగా 12,205 అప్లికేషన్లు వచ్చాయి. అర్హుల జాబితాను వడపోసేందుకు మరోమారు విచారణ పూర్తి చేశారు.
ఇదీ పరిస్థితి
జిల్లాకు మొదట్లో 5,740 డబుల్ బెడ్‌రూం ఇళ్లు అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం మంజూరు చేసింది. వీటికి సంబంధించి 2016లో రెండు పడకల గదుల నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. తరువాత వాటా సంఖ్యను 3,800 కు కుదించారు. ప్రస్తుతం ఇందులో 2,257 ఇళ్లు ఆయా స్థాయిల్లో నిర్మాణ దశశలో ఉన్నాయి. వీటిలో 1,031 ఇళ్లు చిన్న చిన్న పనులు మినహా పూర్తి కావచ్చాయి. మిగతా ఇళ్లు ప్రారంభించకుండానే వదిలేశారు. దరఖాస్తుల విచారణ పూర్తయ్యి రెండేళ్లు పూర్తయినా... అర్హులకు పంచడంలో మీనమేషాలు లెక్కిస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికయినా స్పందించి పూర్తయిన ఇళ్లను కేటాయింపునకు చర్యలు చేపట్టాలనే డిమాండ్ చేస్తున్నారు.
మండలం సంఖ్య
ధారూరు 120
మర్పల్లి 120
యాలాల(కోకట్) 180
తాండూరు టౌన్ 401
పరిగి 180
చౌడాపూర్(అడవి వెంకటాపూర్) 30
ఏడాది క్రితమే ఇళ్లు పంపిణీ చేస్తామని అధికారుల హడావుడి
ఇప్పటికే మూడు పర్యాయాలు విచారణ
50 శాతం మాత్రమే అర్హుల గుర్తింపు
కేటాయింపునకు సిద్ధంగా 1,031 ఇళ్లు
పంపిణీ విషయంలో నేటికీ స్పష్టత కరువు


