
రోగులకు మెరుగైన వైద్యం అందాలి
● ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి
● జిల్లా ఆస్పత్రిలో ఆకస్మిక తనిఖీలు
తాండూరు: రోగులకు మెరుగైన వైద్యం అందించాలని ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి వైద్యులకు సూచించారు. గురువారం పట్టణంలోని జిల్లా ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అత్యవసర విభాగంలో ప్రజలకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. తమకు సకాలంలో వేతనాలు అందడం లేదని కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికులు ఎమ్మెల్యేతో మొరపెట్టారుకున్నారు. అనంతరం డయాలసిస్ సెంటర్‌ను సందర్శించారు. గతంలో బెడ్ల కొరత ఉండేదని, అదనంగా ఏర్పాటు చేయడంతో సమస్య తీరిందని రోగులు తెలిపారు. ఏయే సర్జరీలు చేస్తున్నారని ఎమ్మెల్యే.. ఆస్పత్రి సూపరింటెండెంట్ వినయ్‌కుమార్‌ను ప్రశ్నించగా అన్ని రకాల సర్జరీలు చేస్తున్నట్లు వివరించారు. ప్రభుత్వం నిర్వహించే కాయకల్ప రేసులో జిల్లా ఆస్పత్రికి చోటు దక్కేలా అన్ని రకాల వసతులు కల్పించాలని సూచించారు. రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ర్యాంక్ సాధించాలన్నారు. ఆస్పత్రిలో డ్రైనేజీ వ్యవస్థను మెరుగు పరిచేందుకు నిధులు కేటాయించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ యాదగిరి, డీసీసీబీ వైస్ చైర్మన్ రవిగౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోళ్ల బాల్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు హబీబ్‌లాల, వైద్యులు కేవీఎన్ మూర్తి, ఆనంద్ గోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.