
బాలిక ఆత్మహత్య
పరిగి: బాలిక ఉరివేసుకుని ఆత్మహత్య చేసు కున్న సంసంఘటన మండల పరిధి రూప్‌ఖాన్‌పేట్‌లో శుక్రవారం చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన వెంకటయ్య, లక్ష్మీల కూతురు గాయత్రి(17) పదో తరగతి ఫేయిల్ అయి, ఇంటి వద్ద ఉంటోంది. శుక్రవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో.. ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు.. పరిగి ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మైనర్ మృతిపై స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఓ యువకుడి వేధింపులతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు పేర్కొంటున్నారు. ఇదే విషయమై.. ఎస్‌ఐ మోహన్‌కృష్ణను వివరణ కోరగా.. బాలిక కుటుంబీకుల నుంచి ఫిర్యాదు అందలేదని తెలిపారు. ఫిర్యాదు అనంతరం దర్యాప్తు చేపడతామని చెప్పారు.
ఆటో ఢీ, ఒకరి మృతి
శంకర్‌పల్లి: ఆటో ఢీ కొన్న ప్రమాదంలో పాద చారి మృతి చెందాడు. ఈ సంఘటన శుక్రవారం మోకిల పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ వీరబాబు తెలిపిన వివరాల ప్రకారం.. మిర్జాగూడకు చెందిన శంకర్ సింగ్(48) అవివాహితుడు. తల్లిదండ్రులు మరణించడంతో అన్న ఇంట్లోనే ఉంటూ జీవనం సాగిస్తున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం సదరు వ్యక్తి.. మిర్జాగూడ గేట్ నుంచి హైదరాబాద్ వైపు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఈ క్రమంలో శంకర్‌పల్లి నుంచి నగరం వైపు వెళ్తున్న ఆటో.. శంకర్‌ను బలంగా ఢీ కొట్టింది. దీంతో ఆయన తీవ్ర గాయాలతో అక్కడిక్కడే మృత్యువాత పడ్డాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.
ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి
మహేశ్వరం: ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం టీఎన్జీఓ నిరంతరం పని చేస్తుందని యూనియన్ జిల్లా హడహక్ కమిటీ కన్వీనర్ ముజీబ్ హుస్సేన్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని తహసీల్దార్, ఎంపీడీఓ, ఎస్టీఓ, పంచాయతీరాజ్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సభ్యత్వ నమోదును నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం నుంచి రావాల్సిన అలవెన్సులు, రాయితీలు ప్రతి ఉద్యోగికి అందే విధంగా చూస్తామని చెప్పారు. ఉద్యోగులపై దాడులకు పాల్పడితే సహించేది లేదని, వారికి రక్షణగా ఉంటామన్నారు. కార్యక్రమంలో యూనియన్ సీనియర్ నాయకులు శ్రీధర్‌రెడ్డి, అశోక్, జావీద్ తదితరులు పాల్గొన్నారు.

బాలిక ఆత్మహత్య