
సీపీఆర్‌తో ప్రాణాలు కాపాడవచ్చు
● ప్రతిఒక్కరూ అవగాహన పెంచుకోవాలి
● కలెక్టర్ ప్రతీక్‌జైన్
అనంతగిరి: గుండెపోటుకు గురైన వ్యక్తికి సకాలంలో సీపీఆర్ చేయడం ద్వారా ప్రాణాలు కాపాడవచ్చని కలెక్టర్ ప్రతీక్‌జైన్ అన్నారు. సీపీఆర్‌పై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలని తెలిపారు. గురువారం కలెక్టరేట్‌లోని ఐడీఓసీ సమావేశ మందిరంలో జిల్లా వైద్య శాఖ ఆధ్వర్యంలో సీపీఆర్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చాలా మంది గుండెపోటుతో ప్రాణాలు కోల్పోతున్నారని, సకాలంలో సీపీఆర్ చేస్తే ప్రాణాపాయ స్థితి నుంచి బయట పడతారని తెలిపారు. గుండెపోటుకు గురైన వ్యక్తికి వైద్యం అందేలోపు ఛాతీని 120 సార్లు నొక్కి, 2 శ్వాసలు ఇవ్వడం (120:2 రేషియో) ద్వారా గుండె సాధారణ స్థితికి తీసుకు రావచ్చని తెలిపారు. జిల్లాలో ఈ నెల 13 నుంచి 17వ తేదీ వరకు వారం అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం సీపీఆర్ విధానాన్ని చేసి చూపించారు. మాస్టర్ ట్రైనర్స్ డాక్టర్ నిఖిల్, డాక్టర్ నిరోషా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. కార్యక్రమంలో ఆర్‌డీఓ మంగీలాల్, జిల్లా వైద్యాధికారి డాక్టర్ పవిత్ర, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ రవీందర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.