
గడువు 2 రోజులే!
వికారాబాద్: మద్యం దుకాణాలకు టెండర్ దరఖాస్తు గడువు మరో రెండు రోజుల్లో ముగియనుంది. ఓ వైపు గడువు సమీపిస్తున్నా ఆశించిన స్థాయిలో వ్యాపారులు ముందుకు రాకపోవడంతో అబ్కారీ శాఖలో ఆందోళన మొదలైంది. 2023 – 25 సంవత్సరంలో 59 మద్యం షాపులకు నిర్వహించిన టెండర్లలో జిల్లా నుంచి 2,637 దరఖాస్తులు వచ్చాయి. ఒక్కో దరఖాస్తుకు రూ.2 లక్షల చొప్పున ప్రభుత్వానికి అప్పట్లో రూ.52.74 కోట్ల ఆదాయం సమకూరింది. ప్రస్తుతం దరఖాస్తు ఫీజు రూ.3 లక్షలకు పెంచిన నేపథ్యంలో ఆదాయం కూడా మరింత పెరుగుతుందని ఆశించింది. కానీ ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఇదిలా ఉండగా కొంతమంది వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి ఇతరులు దరఖాస్తు వేయకుండా చూస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గతంలో టెండర్లు వేసిన చాలా మంది నష్టాలు చవిచూశారు. రెండేళ్ల క్రితం వ్యాపారం చేసిన వారు లాభాలు ఆర్జించడంతో 2023 ఆగస్టులో నిర్వహించిన టెండర్లలో రెగ్యులర్ వ్యాపారులే కాకుండా సాధారణ ప్రజలు, ఉద్యోగులు సైతం పోటీ పడ్డారు. టెండర్ ప్రక్రియ ప్రారంభమై 20 రోజులైనా కేవలం 452 దరఖాస్తులు మాత్రమే రావడం అబ్కారీ శాఖలో ఆందోళన నెలకొంది.
డైలమాలోనే వ్యాపారులు
రెండేళ్ల క్రితం బెల్టు షాపుల్లో అధికంగా అమ్మకాలను గుర్తించి ఆయా గ్రామాల్లో కొత్త దుకాణాలకు ప్రతిపాదనలు పంపారు. కానీ షాపుల సంఖ్య పెరగలేదు. అధికారులతో మద్యం వ్యాపారులు లోపాయికారి ఒప్పందం చేసుకోవడంతోనే దుకాణాల సంఖ్య పెరగలేదనే విమర్శలు వచ్చాయి. గతంలో వరుస ఎన్నికలు వస్తాయనే అంచనాలతో పలువురు టెండర్లు వేశారు. ఈ సారి స్థానిక సంస్థల ఎన్నికలు మాత్రమే ఉండటంతో ఎక్కువ మంది ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది.
వ్యక్తిగతంగా దరఖాస్తు వేయడం కంటే గ్రూపుగా ఏర్పడి టెండర్ వేయడానికి ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది. అంతేకాకుండా కొందరు బాగా వ్యాపారం జరిగే దుకాణాలకు ఇతరులు పోటీ రాకుండా చూస్తున్నట్లు సమాచారం. 2023లో పరిగి కేంద్రంగా ఎక్కువ మంది గ్రూపు కట్టారు. ఒక్కో గ్రూపులో 100 మంది సభ్యుల నుంచి 1,000 మంది వరకు కూడా ఉండటం గమనార్హం.. టెండరు డబ్బులు పోకుండా ఉండేందుకు అప్పట్లో ఇలా చేశారనే విమర్శలు వచ్చాయి. ప్రస్తుతం కూడా ఇదే ఫార్ములా పాటిస్తున్నట్లు తెలిసింది.
మద్యం దుకాణాలకు ఆసక్తి చూపని వ్యాపారులు
2023 –25 సంవత్సరానికి వచ్చిన దరఖాస్తులు 2,647
2025 –27కు గాను వచ్చింది కేవలం 452 మాత్రమే
గతంతో పోలిస్తే నాలుగో వంతు కూడా రాని వైనం
సిండికేట్ అయ్యారనే అనుమానాలు
ఫీజు పెంచడమూ ఓ కారణమే