
కొడంగల్ బంద్ విజయవంతం
కొడంగల్: కొడంగల్ అభివృద్ధి పరిరక్షణ ఐక్య కార్యాచరణ కమిటీ (కేడీపీ జేఏసీ) ఆధ్వర్యంలో గురువారం చేపట్టిన కొడంగల్ బంద్ విజయవంతమైంది. ప్రజలు, ఉద్యోగులు, విద్యావంతులు, విద్యార్థులు, వ్యాపారులు, రాజకీయ నాయకులు స్వచ్ఛందంగా పాల్గొని సంఘీభావం తెలిపారు. కొడంగల్‌లో విద్యాసంస్థలను, వ్యాపార సముదాయాలను మూసి మద్దతు తెలిపారు. పట్టణంలోని వినాయక చౌరస్తా నుంచి అంబేడ్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. మెడికల్ కళాశాలను మండల పరిధిలోని అప్పాయిపల్లిలోనే నిర్మించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కేడీపీ జేఏసీ నాయకులు మాట్లాడుతూ.. కొడంగల్‌కు మంజూరు చేసిన ప్రభుత్వ మెడికల్ కళాశాల, యంగ్ ఇండియా ఇంటిగ్రేటేడ్ గురుకులాలను లగచర్లకు తరలిస్తున్నారని ఆరోపించారు. వాటిని ముందుగా ప్రకటించినట్లు మెడికల్ కశాళాలను అప్పాయిపల్లిలో, ఇంటిగ్రేటేడ్ గురుకులాలను పాత కొడంగల్‌లో నిర్మించాలని ప్రభుత్వానికి విన్నవించారు. నియోజకవర్గ కేంద్రమైన కొడంగల్ అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణలో రెండు జాతీయ రహదారులు కలిసే పట్టణాలు అరుదుగా ఉన్నాయన్నారు. అందులో కొడంగల్ ఒకటన్నారు. ఈ ప్రాంతం భవిష్యత్తులో ఎంతో పురోగతి సాధించే అవకాశం ఉందన్నారు. మెడికల్ కళాశాల, గురుకులాల తరలింపుపై ఈ ప్రాంత ప్రజలు అసంతృప్తితో ఉన్నారని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కొడంగల్ ప్రజల మనోభావాలను గౌరవించాలని కోరారు. ఊరేగింపులో కేడీపీ జేఏసీ కన్వీనర్ కొట్రికె లక్ష్మీనారాయణ గుప్తా, కో కన్వీనర్లు గంటి సురేష్, ఎరన్‌పల్లి శ్రీనివాస్, పవన్‌కుమార్, నాయకులు దామోదర్‌రెడ్డి, మధుయాదవ్, రమేష్‌బాబు, చంద్రప్ప, బుస్స చంద్రయ్య, ప్రవీణ్‌కుమార్, రవీందర్‌నాయక్, నవాజ్ తదితరులు పాల్గొన్నారు.
స్వచ్ఛందంగా పాల్గొన్న జనం
విద్యాసంస్థలు, దుకాణాలు మూసివేత
ఊరేగింపులో పాల్గొన్న కేడీపీ జేఏసీ సభ్యులు
మెడికల్ కళాశాలను అప్పాయిపల్లిలోనే నిర్వహించాలని డిమాండ్