
మెడికల్ కళాశాలను తరలించొద్దు
● అప్పాయిపల్లిలోనే భవనం నిర్మించాలి
● బీఆర్‌ఎస్ నాయకుల డిమాండ్
కొడంగల్: ప్రభుత్వ మెడికల్ కళాశాలను మండలంలోని అప్పాయిపల్లిలోనే నిర్వహించాలని, ఇక్కడే భవనాలు నిర్మించాలని బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం పట్టణంలో పార్టీ మండల అధ్యక్షుడు దామోదర్‌రెడ్డి, మాజీ ఎంపీపీలు దయాకర్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, మాజీ కౌన్సిలర్ మధుయాదవ్, మాజీ సర్పంచు రమేష్‌బాబు, కేడీపీ జేఏసీ కో కన్వీనర్ ఎరన్‌పల్లి శ్రీనివాస్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నియోజకవర్గానికి కొడంగల్ ముఖ చిత్రం లాంటిదని పేర్కొన్నారు. ముందుగా కొడంగల్‌ను అభివృద్ధి చేసి ఆదర్శంగా నిలపాలన్నారు. రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయితే ఈ ప్రాంతం అన్ని రంగాల్లోనూ పురోగతి సాధిస్తుందని ప్రజలు నమ్మి ఓట్లు వేశారని అన్నారు. రేవంత్‌రెడ్డి సీఎం అయిన తర్వాత కొడంగల్‌కు ప్రభుత్వ మెడికల్ కళాశాలను మంజూరు చేశారని తెలిపారు. భవన నిర్మాణం కోసం అప్పాయిపల్లిలో రైతుల నుంచి 50 ఎకరాలకు పైగా భూమిని సేకరించారని పేర్కొన్నారు. పక్కనే జాతీయ రహదారి ఉందన్నారు. విద్యార్థులు, అధ్యాపకులు, రోగులు రాకపోకలు సాగించడానికి అనుకూలంగా ఉంటుందన్నారు. కొడంగల్‌కు మంజూరైన మెడికల్ కళాశాలను లగచర్లకు తరలిస్తున్నారని ఆరోపించారు. కేడీపీ జేఏసీ ఆధ్వర్యంలో గురువారం తలపెట్టిన కొడంగల్ బంద్‌కు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఉడిమేశ్వరం మధు, రుద్రారం మధుసూదన్‌రెడ్డి, నవాజొద్దీన్, సముద్రమ్మ తదితరులు పాల్గొన్నారు.
బంద్‌కు సహకరించాలి: కేడీపీ జేఏసీ
కొడంగల్ అభివృద్ధి పరిరక్షణ ఐక్య కార్యాచరణ కమిటీ (కేడీపీ జేఏసీ) ఆధ్వర్యంలో గురువారం తలపెట్టిన పట్టణ బంద్‌కు సహకరించాలని ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ఎంఈఓ రాంరెడ్డికి బుధవారం వినతిపత్రం సమర్పించారు. అనంతరం జిల్లా సహాయ కార్యదర్శి అనిల్ మాట్లాడుతూ.. ప్రభుత్వ మెడికల్ కళాశాల, యంగ్ ఇండియా ఇంటిగ్రేటేడ్ గురుకులాలను లగచర్లకు తరలించడాన్ని నిరసిస్తూ బంద్ పాటించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించాలని కోరారు. కొడంగల్ బంద్‌కు అన్ని వర్గాల ప్రజలు మద్దతు ఇస్తున్నారని తెలిపారు. కుల మత వర్గ భేదం లేకుండా అందరి సహకారం ఉందన్నారు. కొడంగల్‌కు మంజూరు చేసిన ప్రభుత్వ మెడికల్ కళాశాలను, గురుకులాలను కొడంగల్ శివారులోనే నిర్వహించాలని, అక్కడే భవనాలు నిర్మించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ముందుగా ప్రకటించినట్లుగా మున్సిపల్ పరిధిలోని పాత కొడంగల్ గ్రామ శివారులో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల, మండల పరిధిలోని ఎరన్‌పల్లి గ్రామ శివారులో మెడికల్ కళాశాలను నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్, మారుతి తదితరులు పాల్గొన్నారు.

మెడికల్ కళాశాలను తరలించొద్దు