
ఇక పోరాటమే!
జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు నవాబుపేట మండల కేంద్రంగా కార్యాచరణ జూబ్లీహిల్స్ ఉపపోరులో పోటీ చేయాలని నిర్ణయం కృష్ణారెడ్డి పేరు ప్రతిపాదన ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడమేలక్ష్యంగా ముందుకు..
ఏకతాటిపైకి ట్రిపుల్‌ఆర్ బాధిత రైతులు
వికారాబాద్: రీజినల్ రింగ్ రోడ్డు బాధిత రైతులు ఒక్కతాటిపైకి వచ్చారు. జాయింట్ యాక్షన్ కమిటీ గా ఏర్పాటై పోరుబాటకు సిద్ధమయ్యారు. మిగతా జిల్లాల రైతులతో జతకట్టాలని నిర్ణయించారు. ట్రిపుల్‌ఆర్ అలైన్‌మెంట్ మార్చిన నాటి నుంచే హైదరాబాద్ చుట్టూ ఉన్న జిల్లాల్లో దుమారం రేగింది.రంగారెడ్డి, వికారాబాద్, నల్లగొండ, యాదాద్రి భువనగిరి తదితర జిల్లాల్లో నెలా పదిహేను రోజులుగా ఉద్యమిస్తున్నారు. అధికారులకు వినతి పత్రా లు అందజేయడం, కలెక్టరేట్ల వద్ద నిరసనలు, రహదారుల దిగ్బంధం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తరచూ నిరసన గళం వినిపిస్తూనే ఉన్నారు. రీజినల్‌కు తమ పొలాలు ఇచ్చేది లేదని తేల్చి చెబుతున్నారు. తాజాగా మంగళవారం బాధిత రైతులు నవాబుపేట మండలం చించల్‌పేటలో సమావేశమయ్యారు. ఆయా గ్రామాల రైతులు కలిసి జేఏసీగా ఏర్పాటయ్యారు. ఉద్యమ కార్యాచరణకు సిద్ధమయ్యారు. అలాగే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో నామినేషన్ వేయాలని ఏకగ్రీవ తీర్మానం చేశారు.
అలైన్‌మెంట్ మార్పుతోనే..
రీజినల్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ మార్చడంతోనే సమస్య మొదలైంది. పాత అలైన్‌మెంట్(పడమర వైపు) ప్రకారం పొరుగు జిల్లా రంగారెడ్డి పరిధిలోని ఆలూరు – కౌకుంట్ల గ్రామాల మధ్యలోంచి తంగేడుపల్లి మీదుగా ట్రిపుల్ ఆర్ వెళ్లేలా ప్రతిపాదించారు. దీని ప్రకారం మన జిల్లా పరిధిలోని పూడూరు, నవాబుపేట మండలాలకు చెందిన ఒకటి రెండు గ్రామాల మీదుగా వెళ్లేలా డిజైన్ చేశారు. తాజా అలైన్‌మెంట్ వల్ల జిల్లాలోని నాలుగు మండలాలపై ప్రభావం పడింది. పూడూరు, నవాబుపేట మండలాల్లోని 20కి పైగా గ్రామాలు రీజినల్ పరిధిలోకి రాగా.. వికారాబాద్, మోమిన్‌పేట మండలాల్లోని ఐదారు గ్రామాల మీదుగా రోడ్డు వెళ్లేలా ప్రతిపాదనలు తయారు చేశారు. దీంతో రైతులు పోరుబాట పట్టారు.
ప్రభావిత గ్రామాలు..
ఒత్తిడి పెంచేందుకు..
జిల్లాలోని ట్రిపుల్ ఆర్ బాధిత రైతులు మిగతా జిల్లాల రైతులతో కలిసి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని నిర్ణయించారు. అన్ని జిల్లాలను కలుపుకొని ఉమ్మడి జేఏసీ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నారు. అంతేకాకుండా త్వరలో జరగనున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోటీ చేయాలని ఏకగ్రీవ తీర్ణా నం చేశారు. నవాబుపేట మండలం చించల్‌పేట గ్రామానికి చెందిన బాధిత రైతు కృష్ణారెడ్డిని అభ్యర్థిగా ప్రకటించాలని ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చారు. మిగతా ప్రాంతాల రైతులతో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే బీఆర్‌ఎస్ తరఫున గెలిచి ప్రస్తుతం అధికార పార్టీలో కొనసాగుతున్న చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య స్వగ్రామం నుంచే ఈ ఉద్యమ కార్యాచరణ ప్రారంభించడం గమనార్హం.