
డీసీసీ పీఠం ఎవరిదో!
రేసులో కొత్తపేర్లు
వికారాబాద్: జిల్లాలకు డీసీసీ అధ్యక్షులను నియమించేందుకు ఏఐసీసీ, పీసీసీ కసరత్తు చేస్తున్న నేపథ్యంలో.. అధికార పార్టీతో పాటు, ప్రతిపక్ష పార్టీల్లోనూ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎవరనేదానిపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. మూడేళ్లకోసారి పార్టీ సంస్థాగత పటిష్టతలో భాగంగా ఏఐసీసీ నూతన కమిటీలను నియమిస్తుంది. జిల్లా ఏర్పాటు అయ్యాక తొలిసారి తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి డీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. అనంతరం ఆయన పార్టీ వీడటంతో.. ఆ పదవిని ప్రస్తుత డీసీసీ అధ్యక్షుడు టి.రామ్మోహన్‌రెడ్డిని అధిష్టానం నియమించింది. ఆ తరువాత 2022లో కొత్త కమిటీలు వేయగా.. రెండోసారి సారి కూడా టీఆర్‌ఆర్‌కే పీఠం వరించింది. రెండు పర్యాయాలు(ఆరేళ్లు)గా ఆయన బాధ్యతలు చేపడుతూ వచ్చారు. ప్రస్తుతం పదవీ కాలం ముగియటంతో.. కొత్త అధ్యక్షులను నియమించేందుకు పార్టీ కసరత్తు చేస్తోంది. 2023 ఏడాది చివరలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన సారథ్యంలోనే.. జిల్లాలో ఉన్న నాలుగింటికి నాలుగును పార్టీ హస్తగతం చేసుకుంది. ఈ నేపథ్యంలో మరోసారి ఆ పదవి ఆయనకే కట్టబెట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయని పార్టీ నేతలు పేర్కొంటున్నారు.
ఈ సారి వినూత్నంగా..
సాంప్రదాయాలకు భిన్నంగా ఈ సారి అధ్యక్షుల నియామకం విషయంలో అధిష్టానం కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. ఆశావహులు ఎందరున్నా.. దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఒక ఫారం ఇచ్చి, అందులోనే ఆశావహుల వివరాలను నమోదు చేయిస్తోంది. వారు గతంలో పార్టీ పరంగా.. ప్రజా ప్రతినిధులుగాఏ హోదాల్లో పని చేశారు. పార్టీకి అందించిన సేవలు తదితర పూర్తి వివరాలు ఫారంలో పొందుపర్చాల్సి ఉంటుంది.
ఏఐసీసీ బృందం పర్యటన
కేరళకు చెందిన ఎంపీ సారథ్యంలోని ఏఐసీసీ బృందం ఈ నెల 14వ తేదీలోగా జిల్లాలో పర్యటించనుంది. ఆ బృందం సభ్యులు జిల్లా పర్యటనసందర్భంగా క్షేత్రస్థాయి కార్యకర్తలు, నేతలతో పాటు, ఎమ్మెల్యేల అభిప్రాయాలు తీసుకోనుంది. ఈ ప్రక్రియ ముగియగానే ఏఐసీసీ బృందంతో పాటు పీసీసీ చర్చించి, ఆరుగురి పేర్లను ఫైనల్ చేయనుంది. సీల్డ్ కవర్‌లో ఖర్గే సారథ్యంలోని పార్టీ పెద్దలకు అందజేస్తారు. పరిశీలన అనంతరం అధ్యక్షుడి ఎంపిక ఉంటుందని తెలుస్తోంది. అదీ నెలాఖరులోగా ముగియనున్నట్లు సమాచారం.
సమర్థుడి కోసం అన్వేషణ
డీసీసీ పీఠం దక్కించుకునేందుకు ఆశావహులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు పార్టీలో చర్చ. స్థానిక సంస్థల ఎన్నికలు మొత్తం డీసీసీ అధ్యక్షుల సారథ్యంలోనే జరుగుతాయి. మరో మూడేళ్లలో సాధారణ ఎన్నికలు రానున్నాయి. ఇవి కూడా ఇప్పుడు నియమించబోయే అధ్యక్షుడి ఆధ్వర్యంలో జరగనున్నాయి. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని, సమర్థవంతమైన నాయకుడికి పట్టం కట్టాలనే ఆలోచనలో పార్టీ హస్తిన పెద్దలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో జిల్లా పార్టీని నడిపించటంతో పాటు ప్రతిపక్ష పార్టీ నేతలను ఎదుర్కోగల సత్తా ఉన్న నేతకు పట్టం కట్టబెట్టే అవకాశాలు ఉన్నాయి.
అధ్యక్ష పీఠంపై
ఆశావహుల పోటీ
సమర్థుడి వేటలో అధిష్టానం
అందరి అభిప్రాయాలతో హస్తినకు జాబితా
ఏఐసీసీ, పీసీసీ పరిశీలకుల పర్యవేక్షణలో స్కూట్నీ
మరోసారి టీఆర్‌ఆర్‌కే పట్టం!, పరిశీలనలో మరికొన్ని పేర్లు
స్థానిక ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీ కాంగ్రెస్.. సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారించింది. ఎన్నికల్లో పై చేయి సాధించడమే లక్ష్యంగా కసరత్తు చేస్తోంది. ఈ మేరకు జిల్లాకు కొత్త సారథిని ఎంపిక చేసే పనిలో బిజీగా ఉంది. ఇందులో భాగంగా కేడర్ నుంచి అభిప్రాయ సేకరణ కోసం ఏఐసీసీ పరిశీలకుల బృందం పర్యటించనుంది.
గతంలో డీసీసీ రేసులో ఉండి తప్పుకున్న నేతలతో పాటు మరికొన్ని కొత్త పేర్లు పీఠం రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా ప్రస్తుత డీసీసీ అధ్యక్షుడు టీఆర్‌ఆర్‌తో పాటు వికారాబాద్‌కు చెందిన సుధాకర్‌రెడ్డి, ధారూరు మండలానికి చెందిన రఘువీరారెడ్డి, తాండూరుకు చెందిన బుయ్యని శ్రీనివాస్‌రెడ్డి తదితరులు ఇందులో ఉన్నారు. ఒకవేళ బీసీ నేతకుఇవ్వాలనే ఆలోచనలో పార్టీ పెద్దలు ఉన్న నేపథ్యంలో.. తాండూరుకు చెందిన ఉత్తంచంద్, వికారాబాద్‌కు చెందిన గుడిసె లక్ష్మణ్, పరిగి వాసి హన్మంతు ముదిరాజ్, లాల్‌కృష్ణ ప్రసాద్‌లలో ఎవరికో ఒకరికి అవకాశం దక్కనుంది. సమర్థులకే అంటే.. ప్రస్తుత ఎమ్మెల్యేలు రామ్మోహన్‌రెడ్డి, మనోహర్‌రెడ్డిలలో ఒకరికి పీఠం దక్కే అవకాశం లేకపోలేదు.

డీసీసీ పీఠం ఎవరిదో!