
ఉపాధ్యాయుల చేతుల్లోనే భవిష్యత్తు
బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి
కుల్కచర్ల: ఉపాధ్యాయుల చేతుల్లోనే విద్యార్థుల భవిష్యత్తు దాగి ఉందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి అన్నారు. శనివారం కుల్కచర్ల మండలం బండవెల్కిచర్లలోని రవీంద్రభారతి పాఠశాలలో టీచర్స్‌డేను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులను అత్యుత్తమ పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. అత్యంత గౌరవప్రదమైన ఉపాధ్యాయ, విద్యారంగ వ్యవస్థను ప్రభుత్వాలు బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థులకు పాఠ్యంశాలతో పాటు క్రమశిక్షణ, విలువలు, సంప్రదాయాలు, దేశభక్తి, జాతీయ భావాలను నేర్పించాలని సూచించారు. కార్యక్రమంలో పీఎన్‌పీఎస్ సంఘ వ్యవస్థాపక అధ్యక్షుడు రాఘవేందర్ గౌడ్, బీజేపీ మండల అధ్యక్షుడు వెంకటయ్య ముదిరాజ్, పాఠశాల డైరక్టర్ వెంకట్రాములు, ప్రిన్సిపాల్ అబ్దుల్ పర్సన్, రాంచంద్రయ్య, వెంకటయ్య, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.