
లాభాల ‘బంతి’
షాబాద్: ఉద్యానపంటల సాగులో డ్రిప్ పద్ధతిని అవలంభిస్తే నీటిని పొదుపు చేయడానికి అవకాశాలు ఉన్నాయి. పండుగలు, ఇంటి గుమ్మాల అలంకరణకు, ఆలయాల్లో నిర్వహించే పూజలకు అవసరమయ్యే బంతి పూలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. తక్కువ నీటి వనరులతో బంతిని సాగు చేస్తూ, సస్యరక్షణ చేపడితే మంచి ఆదాయాన్ని పొందవచ్చు అని చేవెళ్ల డివిజన్ ఉదాన్యవన శాఖ అధికారి కీర్తి తెలిపారు. అన్ని కాలాల్లో అనుకూలంగా సాగు చేసే బంతిపై సలహాలు, సూచనలు ఆమె మాటల్లోనే..
ఏపుగా పెరిగితే..
బంతిలో ఆఫ్రికన్, ఫ్రెంచ్ మేరీ గోల్డ్ ఉన్నాయి. నీటి వసతి కలిగిన అన్ని కాలాలు, సారవంతమైన గరప నేలలు, నీరు త్వరగా ఇంకిపోయే నేలలు బంతి సాగుకు అనుకూలం. ఎకరానికి వెయ్యి గ్రాముల విత్తనాలు అవసరం. మడులను తయారు చేసి విత్తనాలను చల్లుకోవాలి. బంతి మొక్కలు ఏపుగా పెరిగితే, పూల ఉత్పత్తి తగ్గే అవకాశం ఉంది. సాగుకు విత్తనాల ద్వారా లేదా కత్తిరింపుల ద్వారా ప్రవర్థనం చేయవచ్చు.
కోతకు ముందు నీరుపడితే..
నెల వయసు కలిగిన బంతి మొక్కలు నాటుకోవడానికి అనుకూలంగా ఉంటాయి. నాటుకు వచ్చిన నారును సాయంత్రం వేళల్లో నాటుకోవాలి. నాటిన 60 రోజుల తర్వాత పూత దశ వచ్చేవరకు నేలలో తగినంత తేమ ఉండేలా చూసుకోవాలి. నీటి ఎద్దడితో దిగుబడి తగ్గిపోయే ప్రమాదం ఉంది. పూలు బాగా విచ్చుకున్న తర్వాతనే కోయాలి. అదీ ఉదయం లేదా సాయంత్రం మాత్రమే కోయాలి. కోతకు ముందు నీటి తడి ఇచ్చినట్లయితే పూలు ఎక్కువ సమయం తాజాగా ఉంటాయి. సాధారణంగా ఎకరానికి నాలుగు నుంచి ఐదుటున్నుల దిగుబడి వస్తుంది.
సస్యరక్షణ చర్యలు
పేను.. పూల మొగ్గలను ఆశించి నష్ట పరుస్తాయి. వాటి నివారణకు లీటర్ నీటికి మోనోక్రొటోఫాస్ 1.5 మిలీను కలిపి 15 రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలి. తామర పురుగులు.. ఆకులు, పూల నుంచి రసాన్ని పీల్చి నష్టపరుస్తాయి. ఆకులపై తెల్లని మచ్చలు ఏర్పడతాయి. మొగ్గలు గోదుమ రంగుకు మారి ఎండిపోతాయి. దీని నివారణకు మోనోక్రొటోఫాస్ 1.5 మిలీ.. లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. మొగ్గతొలిచే పురుగులు.. లార్వాలు పూల మొగ్గలను తొలిచేస్తాయి. వీటి నివారణకు ఎండోసల్ఫాన్ 2 మిలీను.. లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి.
తెగుళ్లు, నివారణ
నారుకుళ్లు తెగుళ్లు: నీటి తడి ఎక్కువగా ఉండి, వేడిగా ఉన్న చోట ఈ తెగులు వ్యాపిస్తుంది. లేత మొక్కలు చనిపోతాయి. మడులను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉండే విధంగా చూసుకోవాలి. నేలను లీటర్ నీటికి 2 గ్రాముల కాఫ్టాన్ మందుతో తడపాలి. ఆకు మచ్చ తెగులు: మొక్కల్లో బూడిద రంగు, లేదా నల్లని మచ్చలు ఏర్పడతాయి. లీటర్ నీటికి 2.5 గ్రాముల మాంకోజెబ్ కలిపి పిచికారీ చేయాలి.
సిరులు కురిపిస్తున్న సాగు
తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి
యాజమాన్య పద్ధితిని అవలంబిస్తే మేలు
చేవెళ్ల డివిజన్ ఉద్యానవన శాఖ అధికారి కీర్తి
ఎరువుల వాడకం
మడులను తయారు చేసే సమయంలో బాగా చివికిన పశువుల ఎరువు ఎకరానికి 20 టన్నులు వేసి కలియ దున్నుకోవాలి. దీంతో పాటు 20 నుంచి 40 కిలోల నత్రజని, 80 కిలోల భాస్వరం, 80 కిలోల పొటాష్‌ను వేసుకోవాలి. నాటిన 37 రోజులకు 20 నుంచి 40 కిలోల నత్రజనిని వేసి నీరు పట్టాలి. పాలిడాల్ పాడి చల్లడం వలన చీమలు, చెదను నివారించుకోవచ్చు. విత్తిన విత్తనాలు వారం రోజుల్లో మొతకెత్తుతాయి.
ఉద్యాన పంటలతో లాభాల పంట పడుతుంది. నీటి వసతి కలిగిన ప్రాంతం.. బంతి సాగుకు అనుకూలమైనది. తక్కువ పెట్టుబడితో, యాజమాన్య పద్ధతులను పాటిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చు అని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు.

లాభాల ‘బంతి’