
పీహెచ్‌సీలో సేవలు అంతంతే..!
దౌల్తాబాద్: గ్రామాలతో పాటు పలు మండల కేంద్రాల్లో కొనసాగుతున్న పీహెచ్‌సీల్లో వైద్య సేవలు పూర్తిగా అందడంలేదు. కొన్ని అప్‌గ్రేడ్ కాకపోవడంతో 8 గంటలే సేవలు అందిస్తున్నారు. దౌల్తాబాద్ పీహెచ్‌సీ ఏర్పాటై దాదాపు 25 ఏళ్లవుతున్నా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పని వేళలను పరిమితం చేశారు. 24 గంటల ఆస్పత్రిగా చేయాలని పాలకులు, అధికారులకు విన్నవించినా పట్టించుకోవడంలేదు. సంబంధిత అధికారులు, సిబ్బంది పని వేళలు పాటించాల్సి ఉండడంతో సాయంత్రం నాలుగింటికి ఆస్పత్రికి తాళం వేసి వెళ్లి పోతున్నారు. దీంతో సాయంత్రం, రాత్రి సమయాల్లో ప్రజలకు అత్యవసర సేవలు అందక ఇబ్బందులు పడుతున్నారు. అనారోగ్యానికి గురైనా, రోడ్డు ప్రమాదాలు సంభవించినా, కుక్క కాటుకు గురైనా సాయంత్రం, రాత్రి వేళల్లో కొడంగల్, తాండూరు, కోస్గి తదితర ఆస్పత్రులకు పరుగులు పెట్టాల్సిందే. ఇదే విషయమై అధికారులకు పలుమార్లు విన్నవించినా పట్టించుకునే వారు కరువయ్యారు. మండలంలోని 34 గ్రామాలకు కలిపి దౌల్తాబాద్ పీహెచ్‌సీయే పెద్దది. ఇందులో మెడికల్ ఆఫీసర్, ఫార్మసిస్టు, ల్యాబ్‌టెక్నీషన్, సూపర్‌వైజర్లు, ఏఎన్‌ఎంలు ఉన్నారు. నిత్యం 80కిపైగా ఓపీ కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో 24 గంటల ఆస్పత్రిగా మారుస్తే రోగులకు సౌకర్యంగా ఉంటుందని సూచిస్తున్నారు.
ప్రసవాలు లేవు..
పీహెచ్‌సీ కేంద్రాల్లో ప్రసవాలు తప్పనిసరిగా జరగాలని జిల్లా వైద్య శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే ఇందులో సరైన సదుపాయలు లేకపోవడంతో చాలా మంది ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారు. ప్రస్తుతం రెండు పడకలే ఉండడంతో సేవలు అందడంలేదు. 24 గంటల ఆస్పత్రిగా మార్చి వైద్యసేవలు మెరుగుపర్చాలని స్థానికులు కోరుతున్నారు. ఈ విషయమై వైద్యాధికారిణి ప్రియదర్శిని వివరణ కోరగా 24గంటల ఆస్పత్రిగా మార్చాలని ప్రభుత్వానికి నివేదికలు పంపామన్నారు.
24 గంటలకు అప్‌గ్రేడ్ కాని దౌల్తాబాద్ ఆస్పత్రి
సాయంత్రం, రాత్రిళ్లు అందని వైద్యం
ఇబ్బందుల్లో మండలవాసులు
పట్టించుకోని అధికారులు
నా కూతురు చనిపోయింది..
నా కూతురుకు జ్వ రం వచ్చింది. అయితే రాత్రి సమయంలో ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లాను. ఉదయం గొంతు నొప్పితో పాటు శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారింది. దగ్గర్లోని ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్తే మూసి ఉంది. తెలియక ప్రైవేట్ వాహనంలో కోస్గికి తీసుకెల్తుంటే మార్గమధ్యలో చనిపోయింది. ప్రభుత్వ ఆస్పత్రిని 24 గంటల ఆస్పత్రి చేసి ఉంటే నా కూతురు బతికేది.
– కిష్టప్ప, దౌల్తాబాద్, స్థానికుడు

పీహెచ్‌సీలో సేవలు అంతంతే..!