
పథకాల కోసం లంచం ఇవ్వొద్దు
● అవగాహనతోనే బాల్య వివాహాలకు అడ్డుకట్ట
● తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి
తాండూరు: ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం ఎవ్వరికీ లంచం ఇవ్వరాదని తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి అన్నారు. శనివారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 96 మంది లబ్ధిదారులకు రూ.96,11,136 విలువ చేసే కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు అందజేశారు. మరో 119 మందికి రూ.39.79 లక్షల విలువ చేసే సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంక్షేమ పథకాలను పారదర్శకంగా ప్రజలకు అందిస్తున్నామన్నారు. పథకాల కోసంకొందరు లంచం తీసుకున్నట్లు తెలిసిందన్నారు. నియోజకవర్గంలో రోడ్ల అభివృద్ధికి రూ.400 కోట్లు మంజూరైనట్లు చెప్పారు. గత ప్రభుత్వం తాండూరు పట్టణంలో వెయ్యి డబుల్ బెడ్‌రూం ఇళ్లను అసంపూర్తిగా వదిలేసిందన్నారు. వాటిని పూర్తి చేసి పేదలకు పంపిణీ చేస్తామని తెలిపారు. తాండూరు నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయని ప్రస్తుతం పనులు చరుగ్గా సాగుతున్నట్లు వివరించారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ స్వప్న పరిమళ్, డీసీసీబీ వైస్ చైర్మన్ రవిగౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోల్ల బాల్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ సురేందర్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు హబీబ్‌లాల, మాజీ కౌన్సిలర్లు ప్రభాకర్‌గౌడ్, వెంకన్నగౌడ్, నాయకులు అబ్దుల్ రవూఫ్ తదితరులున్నారు.
ఆర్టీసీకి అండగా ఉంటాం
తాండూరు టౌన్: ఆర్టీసీకి కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని స్థానిక ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. శనివారం తాండూరు నుంచి గానుగాపూర్ వరకు కొత్త బస్సు సర్వీసును జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించిందన్నారు. ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా నాలుగున్నర కోట్ల మంది ప్రయాణం చేశారని పేర్కొన్నారు. తాండూరు డిపోకు కొత్తగా 43 బస్సులను తీసుకురావడంతో పల్లె పల్లెకూ బస్సు వెళ్తోందన్నారు. గానుగాపూర్‌కు కొత్త బస్సు సౌకర్యం కల్పించడం వల్ల తాండూరు ప్రాంత ప్రజలు దత్తాత్రేయ స్వామి దర్శనానికి వెళ్లేందుకు సులభతరమైందన్నారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్లు, కండక్టర్లు ప్రయాణికుల పట్ల గౌరవంగా నడుచుకుంటూ సంస్థను లాభాల బాటలో పయనించేలా కృషి చేయాలన్నారు. ఎమ్మెల్యే, తదితరులు టికెట్ కొనుగోలు చేసి కొంత దూరం బస్సులో ప్రయాణించారు. కార్యక్రమంలో డిపో మేనేజర్ సురేష్ కుమార్, సిబ్బంది, మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోళ్ల బాల్‌రెడ్డి, డీసీసీబీ వైస్ చైర్మన్ రవిగౌడ్, కాంగ్రెస్ నాయకులు సర్దార్ ఖాన్, డాక్టర్ సంపత్, మురళీకృష్ణ గౌడ్, హబీబ్‌లాలా, ప్రభాకర్ గౌడ్, లింగదల్లి రవి, గాజుల మాధవి, వెంకటయ్య, బంటు వేణు, బంటు మల్లప్ప, రాందాసు, గోపాల్, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.