
సమాచారం లేకుండా శిలా ఫలకాలా!
యాలాల: మండలంలోని దౌలాపూర్ సమీపంలో ఏర్పాటు చేయనున్న ఇంటిగ్రేటెడ్ పాఠశాల ఏర్పాటుకు పేదల భూములను బలవంతంగా లాక్కోవడం అన్యాయమని కేవీపీఎస్, దళిత సంఘం నాయకులు అన్నారు. మంగళవారం వారు బాధిత రైతులతో కలిసి మాట్లాడుతూ.. చెన్నారం గ్రామానికి చెందిన అశోక్, కొనిగేరి చంద్రప్ప, కొనిగేరి మాదరప్ప తదితరులకు ప్రభుత్వం సర్వే నెంబర్లు 73, 73/5/3 నెంబర్లలో రెండెకరాల భూమిని కేటాయించింది. 50 ఏళ్లుగా బాధిత కుటుంబాలు భూమిపై ఆధారపడి జీవిస్తున్నారు. కాగా తమకు కేటాయించిన భూమిలో ఎటువంటి సమాచారం లేకుండా శిలాఫలకాలు ఏర్పాటు చేయడం అన్యాయమన్నారు. 2013భూ సేకరణ చట్టం ప్రకారం.. బాధిత రైతుకు భూమికి భూమి, పరిహారం ఇవ్వాలని ఉండగా, అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడం తగదన్నారు. ఈ విషయంలో రెవెన్యూ అధికారులు స్పందించకపోతే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్కయ్య, వ్యకాస జిల్లా అధ్యక్షుడు బుగ్గప్ప, రైతులు వెంకటమ్మ, రాములమ్మ, చంద్రప్ప, మాదరప్ప, సిద్దు తదితరులు ఉన్నారు.
ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటులో భూములు కోల్పోయిన రైతులకు న్యాయం చేయాలి
కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్కయ్య