
భట్టి పర్యటనలో ప్రొటోకాల్ రగడ
యాలాల: మండల పరిధిలోని దౌలాపూర్ సమీపంలో మంగళవారం చేపట్టిన అభివృద్ధి పనుల శంకుస్థాపనకు సంబంధించి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ వివాదానికి దారితీసింది. హాజీపూర్‌తో పాటు మరో ఐదు ప్రాంతాల్లో కొత్తగా ఆరు సబ్‌స్టేషన్ల ఏర్పాటుకు రూ.20 కోట్లు మంజూరయ్యాయి. ఈ విషయమై కార్యక్రమ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో డిప్యూటీ సీఎంతో పాటు స్పీకర్, జిల్లా ఇన్‌చార్జి మంత్రి, స్థానిక ఎమ్మెల్యే ఫొటోతో కూడిన ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీలో ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్‌రెడ్డి ఫొటో లేకపోవడాన్ని గమనించిన ఆయన వర్గీయుడు రఘు, సంబంధిత శాఖ అధికారులను నిలదీశారు. పట్నం ఫొటో వేయకూడదని ఎవరైనా చెప్పారా? ప్రొటోకాల్ తెలీదా అంటూ ట్రాన్స్‌కో అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయమై అధికారుల తీరు సరిగా లేదని పట్నం వర్గీయులు అభిప్రాయపడుతున్నారు.
డిప్యూటీ సీఎంకు నిరసన సెగ
కాగా దౌలాపూర్‌లో శంకుస్థాపన కార్యక్రమాన్ని ముగించుకుని తాండూరు వెళుతున్న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు బీజేపీ శ్రేణుల నుంచి నిరసన ఎదురైంది. రెండు రోజుల క్రితం కాగ్నా కొత్త బ్రిడ్జిపై రంధ్రం పడటంతో పాటు అధ్వాన్నంగా తయారైన రోడ్ల విషయమై బీజేపీ నాయకులు ఆయన కాన్వాయ్‌కు అడ్డుకునేందుకు యత్నించారు. దీంతో పోలీసులు వారిని అరెస్టు చేసి పీఎస్‌కు తరలించారు.
ఫ్లెక్సీలో మండలి చీఫ్ విప్ ఫొటో లేకపోవడంపై ఆగ్రహం
అధికారులను నిలదీసిన పట్నం వర్గీయులు