
ఎరువుల దుకాణాల్లో తనిఖీలు
ధారూరు: మండల కేంద్రంలోని ఎరువుల విక్రయ కేంద్రాల్లో ఎరువుల నిల్వలను మంగళవారం వికారాబాద్ వ్యవసాయ సంచాలకుడు వెంకటేశం తనిఖీ చేశారు. ధారూరు, హరిదాస్‌పల్లి ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల్లో, మోమిన్‌ఖుర్దులోని ఆగ్రో సెంటర్‌లో ఎరువుల నిల్వలు, విక్రయానికి సంబంధించిన రిజిస్టర్లను క్షుణ్ణంగా పరిశీలించారు. అవసరం మేరకు యూరియా కోసం వెనువెంటనే ఇండెంట్లు పెట్టుకోవాలని.. యూరియా కొరత లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీపై ఉందని దుకాణదారులకు సూచించారు. అనంతరం మున్నూరు సోమారం గ్రామ సమీపంలో సాగుచేసిన పత్తి పొలానికి ఎరువు వేసే ప్రక్రియను పరిశీలించారు. పత్తికి పైపాటుగా యూరియా వేయడం వలన గాలిలో కలిసిపోయి మొక్కకు ఏ మాత్రం ప్రయోజనం చేకూర్చదని చెప్పారు. పత్తి మొక్కలకు ఆరు ఇంచుల దూరంలో మట్టితీసి యూరియా వేశాక కప్పివేయాలనీ ఆయన రైతులకు సూచించారు. ఏడీఏ వెంట ఏఈఓ సంజూరాథోడ్ ఉన్నారు.
ప్రజలకు రక్షణ కల్పించండి
పరిగి డీఎస్పీ శ్రీనివాస్
బొంరాస్‌పేట: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రజలకు రక్షణ కల్పించాలని పరిగి డీఎస్పీ శ్రీనివాస్ సూచించారు. వార్షిక సందర్శనలో భాగంగా మంగళవారం ఆయన బొంరాస్‌పేట్ ఠాణాను సందర్శించారు. ఎన్నికలు శాంతియుతంగా నిర్వహించుకునేలా చూడాలన్నారు.