
ఆయిల్‌పాంతో అధిక లాభాలు
వికారాబాద్: ఆయిల్ పాం సాగు చేయడం ద్వారా అధిక లాభాలు పొందవచ్చని వ్యవసాయశాఖ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం వికారాబాద్ మండలం కొత్రెపల్లిలో స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌తో కలిసి ఆయిల్‌పాం మొక్కలు నాటారు. అనంతరం ఏర్పాటు చేసిన సదస్సులో రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆయిల్‌పాం సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం రాయితీలు ఇస్తోందన్నారు. వికారాబాద్ ప్రాంత భూములు ఈ తరహా సాగుకు ఎంతో అనుకూలమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. అధిక సంఖ్యలో సాగు చేస్తే అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. రైతులు ముందుకు రావాలని సూచించారు. ఈ పంట ఒక్కసారి సాగు చేస్తే 40 ఏళ్లపాటు దిగుబడి వస్తూనే ఉంటుందన్నారు. ఎకరాకు ఏడాదికి రూ.2.50 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు ఆదాయం వస్తుందని తెలిపారు. నాలుగేళ్లపాటు అంతర పంటల సాగు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఇందుకు ప్రభుత్వం రాయితీలు ఇస్తుందని వివరించారు. వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. రైతులు ప్రభుత్వ ప్రోత్సాహకాలను అందిపుచ్చుకుని వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవాలన్నారు.
వ్యవసాయ రంగానికి పెద్దపీట
రేవంత్ సారథ్యంలోని ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటినుంచి వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తోందని స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలోనే రూ.లక్ష కోట్లకు పైగా బడ్జెట్ వ్యవసాయ రంగానికి కేటాయించిందన్నారు. రూ.21 వేల కోట్ల పంట రుణాలను మాఫీ చేసిందన్నారు. రైతు భరోసా, సన్నరకం వడ్లకు బోనస్ తదితర ఎన్నో పథకాలను విజయవంతంగా అమలు చేస్తోందని గుర్తు చేశారు. ఆయిల్‌పాం సాగుకు మన జిల్లా భూములు ఎంతో అనుకూలమన్నారు. గత ప్రభుత్వం పాలమూరు ఎత్తిపోతల, ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. కార్యక్రమంలో ఉద్యానవన మరియు పట్టు పరిశ్రమ శాఖ డైరక్టర్ హాస్మిన్‌బాషా, డిప్యూటీ డైరక్టర్ నీరజగాంధీ, అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి సత్తార్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రాజరత్నం, ఆర్డీఓ వాసుచంద్ర, మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వర్, తహసీల్దార్ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.
ఒక్కసారి సాగు చేస్తే 40 ఏళ్లపాటు లబ్ధి
అంతర పంటల సాగుకు రాయితీలు
అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేస్తాం
వ్యవసాయశాఖ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు