తిరుపతి అర్బన్ : పంచాయతీల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ స్థానాలకు సంబంధించి రిజర్వేషన్ కేటగిరీలను బుధవారం వెల్లడించారు. ఈ క్రమంలో ఆయా పంచాయతీల్లో సర్పంచ్‌లకు, డివిజన్ పరిధిలో ఎంపీటీసీలకు, మండల పరిధిలో ఎంపీపీలు, జెడ్పీటీసీల రిజర్వేషన్లు స్పష్టం చేశారు. జెడ్పీ చైర్మన్ ఎస్సీ మహిళలకు కేటాయించిన సంగతి తెలిసిందే. ఇక 35 మండలాల పరిధిలోని జెడ్పీటీసీల్లో 18 స్థానాలు మహిళలకు, 17 స్థానాలను పురుషులకు కేటాయించారు. అలాగే 35 ఎంపీపీ పదవులకు సంబంధించి 18 మహిళలకు, 17 పురుషులకు కేటగిరీల వారీగా విభజన చేశారు. అలాగే 444 ఎంపీటీసీ స్థానాల్లో అధికశాతం మహిళలకే కేటాంయించారు. మరోవైపు 791 పంచాయతీల్లో సర్పంచ్ ఎన్నికలు చేపట్టనున్నారు. అందులోనూ మహిళలకే పెద్దపీట వేశారు. అయితే జెడ్పీటీసీ, ఎంపీటీసీల రిజర్వేషన్ లిస్ట్ అధికారులకు అందక ముందే ఎల్లో మీడియాకి అప్పగించడం గమనార్హం.
సర్పంచ్‌లపైనే దృష్టి
కూటమి నేతల దృష్టి ప్రధానంగా సర్పంచ్‌లపైనే ఉందనే చర్చసాగుతోంది. జెడ్పీటీసీలు, ఎంపీటీసీల రిజర్వేషన్ కేటాయింపుల్లో పెద్దగా కల్పించుకోకపోయినా, సర్పంచ్ల విషయంలో నేతల జోక్యం ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది. దీంతో ఫైనల్ జాబితాను సిద్ధం చేయడానికి పలుమార్లు నియోజకవర్గ ముఖ్యప్రజాప్రతినిధుల చేతుల్లోకి జాబితా వెళ్లినట్లు తెలుస్తోంది., దీంతో పదేపదే వారు పలువురు సర్పంచ్ల రిజర్వేషన్ల అంశంలో మార్పులు చేర్పులు చేపట్టినట్లు పలువురు బాహాటంగానే చర్చించుకుంటున్నారు. తమకు అనుకూలంగా ఉన్న పంచాయతీల్లో రిజర్వేషన్ చేయించుకున్నారని తెలుస్తోంది. 3 దశల్లో సర్పంచ్ ఎన్నికలు చేపట్టనున్నారు.మొదటి దశ నవంబర్ 26న, రెండో దశ నవంబర్ 29న, మూడో దశ డిసెంబర్ 2న చేపట్టనున్నారు. ఎన్నికలు నిర్వహించిన రోజే ఫలితాలు వెల్లడించనున్నారు.,
నేతల చేతుల్లోకి లిస్ట్
మండలాల వారీగా సర్పంచ్‌లకు సంబంధించి రిజర్వేషన్ల వివరాలను అధికారులు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. అయితే బుధవారం సాయంత్రం 7 గంటల వరకు అధికారికంగా వెల్లడించలేదు. అయితే బుధవారం మధ్యాహ్నం 2గంటల నుంచే టీడీపీ మండల నేతలకు అప్పగించారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
జెడ్పీటీసీ స్థానాల కేటాయింపు ఇలా..
జిల్లాలో 35 మండలాలకు జెడ్పీటీసీల ఎన్నికల జరగనున్నాయి. ఎస్టీ మహిళకు–2, ఎస్టీ జనరల్‌కు– 1, ఎస్సీ మహిళ– 5, ఎస్సీ జనరల్– 5, బీసీ మహిళ– 2, బీసీ జనరల్– 2, అన్ రిజర్వుడ్ మహిళ– 9, జనరల్–9 సీట్లు ఖరారు చేశారు. ఎన్నికలను నవంబర్ 3న నిర్వహించి 5న ఫలితాలు వెల్లడించనున్నారు.
ఎంపీపీ స్థానాలకు ఇలా..
35 మండలాలకు సంబంధించి ఎంపీపీ స్థానాలకు రిజర్వేషన్లు ప్రకటించారు. ఎస్టీ మహిళ–2, ఎస్టీ జనరల్– 1, ఎస్సీ మహిళ– 5, ఎస్సీ జనరల్– 5, బీసీ మహిళ– 2, బీసీ జనరల్– 2, అన్ రిజర్వుడు మహిళ– 9, జనరల్– 9 సీట్లు ఖరారు చేశారు.
ఎంపీటీసీ స్థానాల కేటాయింపు ఇలా..
జిల్లా వ్యాప్తంగా 444 చోట్ల ఎంపీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. ఆ మేరకు మండలాల వారీగా రిజర్వేషన్లు కేటాయింపు చేశారు. మహిళలకు 215, జనరల్‌కు 229 కేటాయించారు. కేటగిరీల వారీగా చూస్తే ఎస్టీలకు మొత్తం–36 రిజర్వ్‌చేశారు. అందులో మహిళలకు–8,జనరల్‌కు– 28, ఎస్సీలకు మొత్తం 116 కేటాయించగా, మహిళలకు–55, జనరల్– 61 ఇచ్చారు. బీసీలకు మొత్తం 62 స్థానాలు కేటాయించారు. అందులో మహిళలకు 33, జనరల్–29 ఇచ్చారు. అన్రిజర్వుడుకు మొత్తం 230 స్థానాలు కేటాయించారు. మహిళలకు 119 స్థానాలు, జనరల్‌కు 111 స్థానాలు విభజించారు.
తిరుపతి డివిజన్ పంచాయతీలకు ఖరారు
తిరుపతి రెవెన్యూ డివిజన్ పరిధిలోని 14 మండలాల పంచాయతీలకు రిజర్వేషన్లను ఖరారు చేశారు.
791 పంచాయతీలకే..
జిల్లాలో 807 పంచాయతీలు ఉన్నాయి. అయితే అందులో 16 పంచాయతీలకు సంబంధించి పలు కోర్టు కేసులు నడుస్తున్నాయి. దీంతో 791 పంచాయతీల్లో ఎన్నికలు చేపట్టనున్నారు. ఎక్కువ శాతం మహిళలకు కేటాయించారు. శ్రీకాళహస్తి మండలంలో 42 పంచాయతీలు, ఏర్పేడు మండలంలో 40 పంచాయతీలు ఉన్నాయి. అత్యల్పంగా చిన్నగొట్టిగల్లు మండలంలో 13 పంచాయతీలు, ఎర్రావారిపాళెం మండలంలో 12 పంచాయతీలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా పురుషుల ఓట్లు 6,10,515, మహిళా ఓట్లు 6,43,752, ఇతరులు 104, మొత్తంగా 12,54,371 మంది జిల్లాలో (మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌ను మినహాయిస్తే )ఓటర్లు ఉన్నారు.


