నాయుడుపేట టౌన్ : పట్టణంలోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసి స్ట్రాంగ్‌రూమ్‌లు, ఎన్నికల కౌంటింగ్, నామినేషన్ కేంద్రాలను బుధవారం ఎస్పీ సుబ్బరాయుడు పరిశీలించారు. డీఎస్పీ చెంచుబాబు, కమిషనర్ షేక్ ఫజులుల్లా, సీఐ వెంకటరమణ, ఎస్ఐ శివశంకర్‌తో కలిసి ఆయన ఆయా కేంద్రాలను సందర్శించారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. పోలీస్, రెవెన్యూ అధికారులు సమన్వయంగా పనిచేస్తూ ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేలా బాధ్యతయుతంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. స్ట్రాంగ్‌రూమ్‌లోకి వర్షపు నీరు రాకుండా కట్టుదిట్టంగా చర్యలు చేపట్టాలని సూచించారు. నామినేషన్లు, కౌంటింగ్ సమయంలో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా వాహనాల పార్కింగ్‌కు సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు.
13 మంది పోటు సిబ్బందికి ఉద్యోగోన్నతి
తిరుమల: తిరుమల శ్రీవారి ప్రసాదాల తయారీలో నాణ్యత ప్రమాణాలను మరింత పటిష్టంగా పర్యవేక్షించే దిశగా టీటీడీ 13 మంది సీనియర్ పోటు సిబ్బందికి సూపర్వైజర్లుగా ఉద్యోగోన్నతి కల్పించింది. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ప్రమోషన్ల సమస్య పరిష్కారం కావడంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. బుధవారం సింహ వాహనసేవ అనంతరం శ్రీవారి ఆలయంలో టీటీడీ ఈఓ రవిచంద్ర, అదనపు ఈఓ వెంకయ్య చౌదరి ఈ మేరకు ఉత్తర్వులను ఉద్యోగులకు అందజేశారు. పోటులో 13 మంది సీనియర్ ఉద్యోగులకు ప్రమోషన్ ఇవ్వాలని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు పాలకమండలిలో తీర్మానం చేయించి ప్రభుత్వానికి పంపారు. ఈ ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేయడంతో ఉద్యోగోన్నతుల ప్రక్రియ పూర్తయింది. తమ సమస్య పరిష్కారానికి కృషి చేసిన టీటీడీ బోర్డు చైర్మన్,, ఈఓ, అదనపు ఈఓకు ప్రమోషన్ పొందిన ఉద్యోగులు కృతజ్ఞతలు తెలిపారు.
దివ్యాంగుడిపై దాడి దారుణం
రేణిగుంట : మండలంలోని రామకృష్ణాపురంలో దివ్యాంగుడు సురేష్‌పై పోలీసులు దాడి చేయడం దారుణమని దివ్యాంగ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ మండిపడ్డారు. బుధవారం ఈ మేరకు బాధితుడు సురేష్‌ను పరామర్శించారు. దారి ఆక్రమణ పేరిట ముందస్తు నోటీసులు ఇవ్వకుండా రెవెన్యూ అధికారులు, పోలీసులు దౌర్జన్యంగా సురేష్ ఇంటిని కూల్చేందుకు యత్నించడం అన్యాయమన్నారు. పైగా అడ్డుపడిన సురేష్‌తో పోలీసులు వ్యవహరించిన తీరు అమానవీయమని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం రేణిగుంట డీఎస్పీ శ్రీనివాసరావుకు ఫిర్యాదు చేశారు. ఆయన మాట్లాడుతూ వికలాంగుల హక్కుల చట్టం ప్రకారం దివ్యాంగులపై చేయి చేసుకునే అధికారం ఎవరికీ లేదన్నారు. దీనిపై రాష్ట్రస్థాయి అధికారులకు సైతం ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడించారు. నేతలు మురళీ గౌడ్, మధులత, సురేంద్ర, హేమంత్ కుమార్, అనూష పాల్గొన్నారు.
ఏక్తా దివస్ ర్యాలీకి స్వాగతం
తడ: మాదకద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా ప్రజలకు అవగాహన కల్పించే ఉద్దేశంతో పుదుచ్చేరి నుంచి గుజరాత్‌లోని ఏక్తా నగర్ వరకు చేపట్టిన మోటార్ సైకిల్ ర్యాలీకి ఆంధ్రా సరిహద్దుల్లోని పన్నంగాడు వద్ద పోలీసులు ఘన స్వాగతం పలికారు. తమిళనాడు, అండమాన్, నికోబార్, పుదుచ్చేరికి చెందిన పోలీసులు బృందాలు 1972 కిలోమీటర్ల ర్యాలీని బుధవారం చైన్నెలో ప్రారంభించారు. సీఐ మురళీకృష్ణ, ఎస్ఐ కొండప నాయుడు స్వాగతం పలికారు.
సరుకుల సరఫరాకు టెండర్లు
తిరుపతి అర్బన్ : సంక్షేమ హాస్టళ్లకు సరుకులు సరఫరా చేసేందుకు ఆసక్తిగల వ్యాపారుల నుంచి టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు జేసీ గోవిందరావు తెలిపారు.. బుధవారం ఆయన మాట్లాడుతూ టెండర్ దరఖాస్తును ఈ నెల 24వ తేదీలోపు కలెక్టరేట్లోని బీ బ్లాక్ 3వ అంతస్తులోని ఎస్సీ, సంక్షేమ సాధికారిత కార్యాలయంలో ఏర్పాటు చేసిన బాక్స్‌లో వేయాలని వెల్లడించారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు సీల్డ్ కవర్లు ఓపెన్ చేయనున్నట్లు వివరించారు. పని దినాల్లో మాత్రమే దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని స్పష్టం చేశారు. రూ.2వేలు చెల్లించి కలెక్టరేట్లోని తమ కార్యాలయంలో దరఖాస్తులు పొందవచ్చునని వివరించారు.


