మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల షెడ్యూల్ విడుదల అమలులోకి వచ్చిన కోడ్ జిల్లాలో ఒక కార్పొరేషన్, నాలుగు మున్సిపాలిటీలకు ఎన్నికలు 35 జెడ్పీటీసీ, 444 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్
సాక్షి, తిరుపతి : స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. బుధవారం మున్సిపాలిటీలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఈ క్రమంలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. తొలుత మున్సి‘పొల్స్’, తర్వాత పరిషత్, చివరగా పంచాయతీ ఎన్నికలను నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ మేరకు షెడ్యూల్ విడుదలవడంతో ఆశావహులు తమ అదృష్టం పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు. జిల్లాలో తిరుపతి నగరపాలక సంస్థతోపాటు వెంకటగిరి, సూళ్లూరుపేట, నాయుడుపేట, పుత్తూరు మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. రెండో విడతలో శ్రీకాళహస్తి పురపాలక సంఘానికి ఎన్నిక జరగనుంది.
19న ప్రాదేశిక నోటిఫికేషన్
ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు ఈ నెల 19న నోటిఫికేషన్ వెలుడనుంది. 21 నుంచి నామినేషన్ల స్వీరణ ప్రారంభమై, 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ముగియనుంది. ఈనెల 19వ తేదీ నామినేషన్లు పరిశీలిస్తారు. 27వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంటుంది. అదే రోజు బరిలో నిలిచే అభ్యర్థుల తుది జాబితాను ప్రచురిస్తారు. పోలింగ్ నవంబర్ 3వ తేదీ ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తారు. అవసరమైన చోట రీపోలింగ్ కోసం 4వ తేదీని కేటాయించారు. 5వ తేదీ ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభించి ఫలితాలను ప్రకటిస్తారు.
12,54,371 మంది ఓటర్లు
జిల్లాలోని 35 జెడ్పీటీసీ స్థానాలతో పాటు 444 ఎంపీటీసీ స్థానాలకు ఒకేసారి ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో జిల్లావ్యాప్తంగా 12,54,371 మంది తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. వీరిలో 6,10,515 మంది పురుషులు, 6,43,752 మంది మహిళలు, 104 మంది ఇతరులు ఉన్నారు. ఈ మేరకు 1,641 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో 312 అత్యంత సమస్యాత్మకమైన 362 సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాలుగా గుర్తించారు. ఎన్నికల నిర్వహణ కోసం అవసరమైన సిబ్బంది, బ్యాలెట్ పేపర్లు, బాక్సులు, వాహనాలను ఏర్పాటు చేయడంలో జిల్లా పరిషత్ అధికారులు నిమగ్నమయ్యారు.
పెరిగిన రాజకీయ వేడి
ఎన్నికల కోడ్ వెలువడడంతో గ్రామాల్లో రాజకీయ వేడి పెరిగింది. పార్టీల బలబలాలను అంచనా వేసి ఎవరు పోటీలో ఉంటే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయో లెక్కలు వేస్తున్నారు. అనుకూలమైన రిజర్వేషన్లు రాక పోటీ చేయాలనుకున్న కొందరి ఆశలు ఆడియాశలయ్యాయి. మరోవైపు అభ్యర్థిత్వం కోసం అధినాయకులను ప్రసన్నం చేసుకునేందుకు ఆశావహులు పరుగులు పెడుతున్నారు. తమ వెంట ఉండే చోటామోటా నాయకులను వెంటబెట్టుకుని బలప్రదర్శన చేపడుతున్నారు. అధికార బలంతో ఎలగైనా స్థానిక పోరులో పైచేయి సాధించాలని కూటమి నేతలు కుట్రలు పన్నుతుండడం గమనార్హం.
మున్సిపాలిటీ వార్డుల ఓటర్ల
సంఖ్య సంఖ్య
తిరుపతి కార్పొరేషన్ 66 2,90,492
వెంకటగిరి 36 44,140
నాయుడుపేట 32 37,100
సూళ్లూరుపేట 32 35,519
పుత్తూరు 36 40,210
మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ ఇలా..
మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు
పంచాయతీ ఎన్నికలను మూడు విడతలుగా నిర్వహించనున్నట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. నవంబర్లో 26, 29, డిసెంబర్ 2వ తేదీలలో పంచాయతీ పోలింగ్ జరగనుంది. జిల్లాలో 36 మండలాల పరిధిలోని 807 పంచాయతీలుండగా అందులో కోర్టు కేసులున్న 16 పంచాయతీలు పోను మిగిలిన 791 పంచాయతీలు, 7,348 గ్రామ వార్డులకు 7,458 పోలింగ్ కేంద్రాలలో ఎన్నికలు నిర్వహించనున్నారు.
మున్సిపోల్స్కు రేపటి నుంచి నామినేషన్లు
మున్సిపల్ ఎన్నికలకు శుక్రవారం ఆర్ఓలు నోటీసులు జారీ చేయనున్నారు. దీంతో నామినేషన్ల పర్వం మొదలుకానుంది. ఈ నెల 18వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు నామినషన్లను స్వీకరించనున్నారు. 19వ తేదీన నామినేషన్లు పరిశీలిస్తారు. 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుంది. అదే రోజు బరిలో నిలిచే అభ్యర్థుల తుది జాబితాను ప్రచురిస్తారు.పోలింగ్ 28వ తేదీ ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తారు. అవసరమైన చోట రీపోలింగ్ కోసం 29వ తేదీని కేటాయించారు. 30వతేదీ ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభించి ఫలితాలను ప్రకటిస్తారు. శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న నామినేషన్ల స్వీకరణకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.


