పొత్తులో ఎత్తులు! | - | Sakshi
Sakshi News home page

పొత్తులో ఎత్తులు!

Oct 15 2026 8:00 AM | Updated on Oct 15 2026 8:00 AM

తిరుపతిలో మారుతున్న సమీకరణలు మేయర్‌ పీఠం కోసం టీడీపీ, జనసేన, బీజేపీ నేతల పైరవీలు గ్లాస్‌ పార్టీలో ప్రణీత్‌ చేరిక వెనుక సైకిల్‌ పెద్దలు భాను కోసం లాబీయింగ్‌ చేస్తున్న ఢిల్లీ ప్రముఖులు తిరునగరంలో రసవత్తరంగా రాజకీయాలు

సాక్షి ప్రతినిధి, తిరుపతి : తిరుపతి మేయర్‌ పీఠమే లక్ష్యంగా కూటమిలో రాజకీయ సమీకరణలు రోజు రోజుకూ మారిపోతున్నాయి. మేయర్‌ పదవి తమకే కావాలంటూ టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు ఎవరికి వారు గట్టిగా పట్టుబడుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో మేయర్‌ పీఠం వదులుకునేందుకు కూటమిలోని మూడు పార్టీల నేతలు ఎవరూ సిద్ధంగా లేరు. అలాగే తమ పార్టీ అభ్యర్థినే బరిలో దించేందుకు అధినేతలు సైతం పట్టువీడడంలేదు. ఆర్థిక బలం ఉన్న వారిని పార్టీలో చేర్చుకుని పోటీకి మార్గం సుగమం చేసుకుంటున్నారు. అందులో భాగంగానే ప్రముఖ విద్యాసంస్థల యజమాని ప్రణీత్‌ బుధవారం అమరావతిలో పవన్‌కల్యాణ్‌ చేతులమీదుగా జనసేన కండువా కప్పుకున్నారు. దీంతో కూటమిలో రాజకీయం ఒక్కసారిగా వేడిక్కెంది. రాష్ట్రంలోనే తిరుపతిది ప్రత్యేక స్థానం. అటువంటి నగరంలో రాజకీయంగా చక్రం తిప్పేందుకు ప్రతి ఒక్కరూ పోటీపడుతుంటారు. అందుకే గతంలో డిప్యూటీ మేయర్‌ పదవి కోసం కూటమి నేతలు చేసిన అరాచకం సృష్టించిన విషయం విధితమే. తాజాగా తిరుపతి కార్పొరేషన్‌ ఎన్నికల్లో మేయర్‌ పీఠమే లక్ష్యంగా మూడు పార్టీల నేతలు పైరవీలు సాగిస్తున్నారు.

ప్రణీత్‌ చేరిక వెనుక టీడీపీ పెద్దలు?

.విద్యా సంస్థల అధినేత ప్రణీత్‌ జనసేనలో చేరడం వెనుక టీడీపీ పెద్దల హస్తం ఉన్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. నిన్నటి వరకు ప్రణీత్‌కు టీడీపీ నేతగా పేరుంది. పత్రికల్లో ఇచ్చిన ప్రకటనల్లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌ ఫొటోలే ఉన్నాయి. అయితే హడావుడిగా ప్రణీత్‌ జనసేనలో చేరడం తిరుపతి నగరంలో చర్చనీయాంశమైంది. మేయర్‌ పీఠం కావాలని జనసేన పట్టుబడుతున్న నేపథ్యంలో తమ మనిషి ప్రణీత్‌ను ఆ పార్టీలో చేర్పించి పదవిని కట్టబెట్టాలని చూస్తున్నారని కూటమి నేతలు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు.

ఢిల్లీ నుంచి లాబీయింగ్‌

తిరుపతి మేయర్‌ పీఠం కోసం బీజేపీ నేత భానుప్రకాష్‌రెడ్డి ఢిల్లీ పెద్దల ద్వారా సీఎం చంద్రబాబుపై ఒత్తిడి తీసువస్తున్నట్లు ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. కేంద్రం, రాష్ట్రంలో కూటమి భాగస్వామ్యం ఉండడంతో తన కుమారుడు పృథ్వీని మేయర్‌ని చేసేందుకు భానుప్రకాష్‌రెడ్డి తీవ్రంగా కృషి చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే టీడీపీ తిరుపతి నేతలు మాత్రం మేయర్‌ స్థానం విషయంలో పట్టువీడడం లేదని సమాచారం. బీజేపీ, జనసేనలకు చెందిన అభ్యర్థులను ప్రకటిస్తే.. ఊరుకునేది లేదని, ఏమాత్రం సహకరించమని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. రాష్ట్రంలోనే ముఖ్యమైన తిరుపతి నగరంలో టీడీపీని బలహీన పరిచేందుకే బీజేపీ, జనసేన కుట్రలు చేస్తున్నాయని తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ నేతకే మేయర్‌ అభ్యర్థిత్వం ఇవ్వాలని చంద్రబాబు, లోకేష్‌ వద్ద పట్టుబడుతున్నట్లు ఆ పార్టీ కార్యకర్తలు చెబుతున్నారు. అయితే కూటమి తరఫున తిరుపతి మేయర్‌ అభ్యర్థి ఎవరనేది నేడో రేపో స్పష్టత వచ్చే అవకాశమున్నట్లు తెలిసింది.

తిరుపతి ప్రథమ పౌరుని పదవి దక్కించుకునేందుకు కూటమి నేతలు హోరాహోరీగా తలపడుతున్నారు. అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఎవరికి వారు పైరవీలు సాగిస్తున్నారు. మేయర్‌ పీఠం ఎక్కడమే లక్ష్యంగా పొత్తు పేరిట ఎత్తులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే రాత్రికి రాత్రే కండువాలను మార్చేస్తున్నారు. ఎలాగైనా అభ్యర్థిత్వం సాధించేందుకు అధినేతలపై ఒత్తిడి తీసుకువస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement