తిరుపతి రూరల్: తిరుపతి రూరల్ మండలం, తుమ్మలగుంటలో శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. గోవింద నామస్మరణలు, మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్ఛారణలతో గ్రామమంతా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు మంగళవారం ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి చిన్నశేష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, చెవిరెడ్డి లక్ష్మి దంపతులు వాహన సేవలో పాల్గొన్నారు.
వైభవంగా తిరుమంజనం, ఊంజల్ సేవ
నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఉదయం 11 గంటలకు స్వామి వారికి శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం వివిధ పూజా క్రతువులు జరిపారు. సాయంత్రం ఆలయ ప్రాంగణంలో భక్తుల సమక్షంలో ఊంజల్ సేవను వైభవంగా నిర్వహించారు.
హంస వాహనంపై స్వామి వారి దర్శనం
మంగళవారం రాత్రి హంస వాహనంపై స్వామి వారు సరస్వతి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. విద్యుత్ దీపాలంకరణల మధ్య సాగిన వాహన సేవ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.


