వెంకటగిరి రూరల్: వ్యవసాయ భూమికి సంబంధించి దారి విషయమైన వివాదం నెలకొంది. వైఎస్సార్ కాంగ్రెస్పార్టీకి అనుకూలంగా ఉన్న ఓ కుటుంబంపై స్థానిక అధికార పార్టీ నేతలు కక్ష సాధింపు చర్యలకు పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. మండల పరిధిలోని జీకేపల్లికి చెందిన వైఎస్సార్సీపీ నేత కుటుంబం గుత్తికొండ రాజేశ్వరికి సంబంధించి సర్వే నం.56.01లో ఉన్న తమ పట్టా భూమిలో దారి ఏర్పాటు చేయడంతోపాటు మట్టి తోలేందుకు కూటమికి చెందిన స్థానిక నేతలు యత్నించారు. భూ బాధితలు ఘటనా స్థలానికి చేరుకుని ప్రశ్నించగా వారితో వాగ్వాదానికి దిగారు. గ్రామానికి చెందిన అఽధికార పార్టీ నేత బాబునాయుడు తమపై దాడికి పాల్పడడంతోపాటు తమ కుమారుడు సురేష్ ద్విచక్ర వాహనాన్ని సైతం ధ్వంసం చేశారని బాధితులు ఆరోపించారు. బాబు నాయుడుతోపాటు స్థానిక టీడీపీ నేతలు కాశీనాయుడు, రమణయ్య, జయ, తిరుపాల్ నాయుడుతోపాటు పలువురు ట్రాక్టర్ ద్వారా మట్టి తోలకాలు సాగించడంతో బాధిత మహిళ రాజేశ్వరి అడ్డుకున్నారు. ఆపై పోలీసులు రాజేశ్వరికి సర్దిచెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
గో సంరక్షణకు ప్రత్యేక చర్యలు
తిరుమల : గో సంరక్షణ, జంతు పరిరక్షణకు టీటీడీ ప్రత్యేక చర్యలు చేపడుతోందని గోశాల డైరెక్టర్ శివకుమార్ తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ తిరుమలలోని అన్నప్రసాద కేంద్రానికి రోజూ 15 వేల లీటర్ల పాలను సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. బ్రహ్మోత్సవాల్లో వాహనసేవలకు ఏనుగులు, అశ్వాలు, వృషభాలను వినియోగిస్తున్నట్లు వెల్లడించారు. భక్తుల భద్రత, ఏనుగుల సంరక్షణ దృష్ట్యా వాటితో ఆశీర్వాదాలు తీసుకోవడాన్ని నిషేధించినట్లు తెలిపారు. భక్తులు నిబంధనలు పాటించాలని కోరారు.


