చంద్రగిరి: తిరుపతి నగరంలో రవాణా సౌకర్యాలను మెరుగుపరచి, ప్రధాన ప్రాంతాల మధ్య కనెక్టివిటీని పెంపొందించే లక్ష్యంతో తిరుచానూరు గ్రామ పంచాయతీ పరిధిలో 100 అడుగుల మాస్టర్ ప్లాన్ రోడ్ల నిర్మాణం చేపట్టామని కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. మంగళవారం తిరుచానూరు పంచాయతీ పరిధిలో చేపట్టిన మాస్టర్ ప్లాన్ రోడ్ల నిర్మాణానికి తుడా చైర్మన్ డాలర్ దివాకర్రెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానితో కలసి కలెక్టర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. తిరుపతి పట్టణం పరిసర ప్రాంతాల అభివృద్ధికి ఇటీవల ముఖ్యమంత్రి చేతుల మీదుగా 9 మాస్టర్ ప్లాన్ రోడ్లకు శంకుస్థాపన చేసినట్టు వెల్లడించారు. ఈ నేపథ్యంలో వాటి పనులను క్షేత్ర స్థాయిలో ప్రారంభించే దిశగా అడుగులు వేస్తున్నట్టు వెల్లడించారు. ఇందులో భాగంగా రూ.44 కోట్ల తుడా, టీటీడీ నిధులతో తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయాన్ని అనుసంధానం చేసే విధంగా కొట్రమంగళం రోడ్డు జంక్షన్ నుంచి పూడి రోడ్డు జంక్షన్ వరకు గల మాస్టర్ ప్లాన్ రోడ్డు నిర్మాణం చేపడుతున్నామన్నారు. ఈ రోడ్డు విస్తరణలో భాగంగా 100 అడుగుల మాస్టర్ ప్లాన్ రోడ్డు నిర్మాణంతో పద్మావతి అమ్మవారి ఆలయానికి రాకపోకలు మరింత సులభతరమవుతాయని చెప్పారు. అలాగే ఎన్హెచ్ –71 (కోర్టు కాంప్లెక్స్) నుంచి కొట్రమంగళం రోడ్డు జంక్షన్ వరకు రూ.20 కోట్లతో 100 అడుగుల వెడల్పు మాస్టర్ ప్లాన్ రోడ్డు నిర్మాణం చేపడతామన్నారు. శెట్టిపల్లి టౌన్ షిప్ నుంచి దామినేడు వరకు రూ.19.1 కోట్లతో రోడ్డు ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొన్నారు. టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్, యాదవ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహయాదవ్, మాజీ కేంద్ర మంత్రి పనబాకలక్ష్మి, జాయింట్ కలెక్టర్ ఆర్. గోవిందరావు పాల్గొన్నారు.


