ఓపెన్‌ స్కూల్లో ప్రవేశానికి 31 వరకు గడువు | - | Sakshi
Sakshi News home page

ఓపెన్‌ స్కూల్లో ప్రవేశానికి 31 వరకు గడువు

Oct 14 2026 12:35 AM | Updated on Oct 14 2026 12:35 AM

తిరుపతి ఎడ్యుకేషన్‌ : ఓపెన్‌ స్కూల్‌ ద్వారా 2026–27వ విద్యాసంవత్సరంలో పది, ఇంటర్మీడియెట్‌లో ప్రవేశాలకు ఈ నెల 31వ తేదీ వరకు గడువు పొడిగించినట్లు డీఈఓ కేవీఎన్‌.కుమార్‌ తెలిపారు. ఎటువంటి అపరాధ రుసుము లేకుండా ఈ నెల 31వ తేదీలోపు పది, ఇంటర్‌లో అడ్మిషన్లు పొందవచ్చని పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డీఈఓ కోరారు.

ఎన్‌ఎంఎంఎస్‌ పరీక్ష తేదీ మార్పు

తిరుపతి ఎడ్యుకేషన్‌ : జాతీయ స్థాయిలో 2026–27వ విద్యాసంవత్సరానికి సంబంధించి 8వ తరగతి విద్యార్థులకు నిర్వహించే జాతీయ ఉపకార వేతన (ఎన్‌ఎంఎంఎస్‌) పరీక్ష తేదీని మార్పు చేసినట్లు డీఈఓ కేవీఎన్‌.కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. నవంబరు 15న నిర్వహించాల్సిన పరీక్షను అదే నెల 29వ తేదీకి మార్పు చేసినట్లు పేర్కొన్నారు. ఈ పరీక్షను ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించనున్నారని తెలిపారు. ఈ పరీక్షకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు సమర్పణ, ఫీజు చెల్లింపు, నామినల్‌ రోల్స్‌ సమర్పణ గడువును పొడిగించినట్లు తెలిపారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి, ఫీజు చెల్లించడానికి ఈ నెల 27వ తేదీ ఆఖరు అని, ముద్రిత నామినల్‌ రోల్స్‌, ఇతర సంబంధిత పత్రాలను డీఈఓ కార్యాలయానికి 28వ తేదీలోపు సమర్పించాలని సూచించారు. అలాగే డీఈఓ లాగిన్‌లో దరఖాస్తుల ఆమోదానికి 29వ తేదీ ఆఖరు అని తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.బీఎస్‌ఈ.ఏపీ.జీఓవీ.ఇన్‌’ వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.

శ్రీవారి భక్తులకు ప్రత్యేక రైళ్లు

తిరుపతి అన్నమయ్యసర్కిల్‌: దసరా నవరాత్రి బ్రహ్మోత్సవాలను దృష్టిలో ఉంచుకుని తిరుమలకు చేరుకునే భక్తుల రద్దీకి అనుగుణంగా తిరుపతి వరకు ప్రత్యేక రైళ్లు నడపడానికి రైల్వే అధికారులు చర్యలు చేపట్టారు. అందులో భాగంగా ఈ నెల 13 (మంగళవారం) నుంచి 16 వ తేదీ వరకు విజయవాడ నుంచి తిరుపతికి ప్రత్యేక రైలు సర్వీసు అందుబాటులోకి వచ్చింది. రైలు నం.(07249) ఉదయం 9.30 గంటలకు విజయవాడ నుంచి బయలుదేరి సాయంత్రం 7 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో రైలు (07250) అదే రోజు రాత్రి 9.10 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5.30 గంటలకు విజయవాడకు చేరుకుంటుంది. ఈ రైలు తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట స్టేషన్లలో ఆగుతుంది. మొత్తం 19 కోచ్‌లతో నడుస్తుంది. అదే రోజు గుంటూరు నుంచి తిరుచానూరుకు మరో ప్రత్యేక రైలు కూడా నడుస్తుంది. రైలు నం.(07227) మంగళవారం సాయంత్రం 7.15 గంటలకు గుంటూరు నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7.30 గంటలకు తిరుచానూరుకు చేరుకుంటుంది. ఇది వన్‌ వే సర్వీస్‌. నరసరావుపేట, వినుకొండ, మార్కాపురం, నంద్యాల, కడప, రాజంపేట, రేణిగుంట వంటి ప్రధాన స్టేషన్ల మీదుగా ప్రయాణిస్తుంది. ఈ రైలులో 8 ఏసీ, 8 స్లీపర్‌, 4 జనరల్‌ కోచ్‌లు ఉన్నాయి. దసరా సందర్భంగా చర్లపల్లి నుంచి కూడా తిరుపతికి ప్రత్యేక రైళ్లు నడు స్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని అనేక స్టేషన్ల నుంచి ఈ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. తిరుమల శ్రీవారి దర్శనం చేసుకోవాలనుకునే భక్తులు ఈ ప్రత్యేక రైళ్ల సమయాలను ముందు గానే తెలుసుకుని టికెట్లు బుక్‌ చేసుకోవాలని రైల్వే అధికార యంత్రాంగం సూచిస్తోంది.

ఓట్ల లెక్కింపు ఏర్పాట్ల పరిశీలన

తిరుపతి సిటీ: తిరుపతి నగరపాలక సంస్థ స్థానిక ఎన్నికల నిర్వహణలో భాగంగా ఓట్ల లెక్కింపు కోసం శ్రీ వేంకటేశ్వర ఆర్ట్స్‌ కళాశాలలో చేపట్టాల్సిన ఏర్పాట్లను మంగళవారం కలెక్టర్‌ డాక్టర్‌ ఎస్‌ వెంకటేశ్వర్‌, ఎస్పీ సుబ్బరాయుడు, మున్సిపల్‌ కమిషనర్‌ ఎం.జయకృష్ణ పరిశీలించారు. ఈ సందర్భంగా కళాశాలలో స్ట్రాంగ్‌ రూమ్‌ల ఏర్పాటు తదితర ఏర్పాట్లను పరిశీలించారు. కార్యక్రమంలో అడిషనల్‌ ఎస్పీలు రవిమనోహరాచారి, శ్రీలత, ఎలక్షన్‌ డిప్యూటీ కలెక్టర్‌ భరత్‌ నాయక్‌, మున్సిపల్‌ డిప్యూటీ కమిషనర్‌ అమరయ్య, తిరుపతి స్మార్ట్‌ సిటీ జనరల్‌ మేనేజర్‌ చంద్రమౌళి పాల్గొన్నారు.

స్థానిక ఎన్నికల ఏర్పాట్లపై దృష్టి

తిరుపతి అర్బన్‌: స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పకడ్బందీగా ఏర్పాట్లు చేపట్టాలని కలెక్టర్‌ ఎస్‌.వెంకటేశ్వర్‌ అధికారులను ఆదేశాలు ఇచ్చారు. ఆ మేరకు ఆయన మంగళవారం కలెక్టరేట్‌లో జేసీ గోవిందరావు, తిరుపతి కమిషనర్‌ జయకృష్ణ, డీఆర్వో నరసింహులు, డీపీవో సుశీలాదేవితో కలసి అధికారులతో సమీక్షించారు. ఎన్నికలకు సంబంధించి పలు అంశాలపై దిశా నిర్దేశం చేశారు. అంతా అప్రమతంగా ఉండాలన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement