రిజర్వేషన్లపై అసహనం వ్యక్తం చేస్తున్న బీజేపీ, జనసేన బీసీలకు కేటాయించకపోవడంపై విస్మయం శ్రీకాళహస్తిలో ఎవరికి వారు యమునాతీరే బీసీ, ఎస్సీల అంచనాలు తలకిందులు
తిరుపతి కార్పొరేషన్ : జనరల్
శ్రీకాళహస్తి– బీసీ (జనరల్)
నాయుడుపేట–జనరల్ (మహిళ)
సూళ్లూరుపేట– ఎస్సీ (మహిళ)
వెంకటగిరి – జనరల్ (మహిళ)
పుత్తూరు– బీసీ (జనరల్)
స్థానిక ఎన్నికల రిజర్వేషన్లపై కూటమిలో కుమ్ములాటలు మొదలయ్యాయి. తిరుపతి మేయర్ స్థానం జనరల్‌కు కేటాయించడంపై ఆ పార్టీ నేతల్లో అసంతృప్తి సెగలు రాజుకుంటున్నాయి. రాజకీయ పార్టీల్లో సైతం వేగంగా సమీకరణాలు మారిపోతున్నాయి. టీడీపీ కపట నాటకం ఆడిందనే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. తన వక్రబుద్ధితో జిల్లాలో ముఖ్యమైన మునిసిపాలిటీలతోపాటు మేయర్ స్థానం జనరల్‌కు కేటాయించిందనే అనుమానాలు ఆశావహుల నుంచి వ్యక్తమవుతున్నాయి.
సాక్షి ప్రతినిధి, తిరుపతి: మున్సిపల్, కార్పొరేషన్ స్థానాల రిజర్వేషన్లు కూటమి నేతలకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. బీజేపీ, జనసేనకు బలమైన అభ్యర్థులున్న స్థానాల్లో టీడీపీ కావాలనే కుఠిలయత్నంతో జనరల్‌కు కేటాయించి తన వక్రబుద్ధిని చాటుకుందని ఆ పార్టీల నేతలు చెవులు కొరుక్కుంటున్నారు. ఈ సారి తిరుపతి మేయర్ పీఠం బీసీ, లేదా ఎస్సీ సామాజిక వర్గాలకు కేటాయిస్తారని ఆశించిన ఆశావహులకు నిరాశే ఎదురైంది.
స్థానికం.. ప్రతిష్టాత్మకం
జిల్లాని ముఖ్యమైన పట్టణాల్లో శ్రీకాళహస్తి ఒకటి. శ్రీకాళహస్తి మున్సిపాలిటీని బీసీ (జనరల్)కు కేటా యించారు. చివరగా ఇక్కడ ఎన్నికలు 2014లో జరిగాయి. అప్పట్లో టీడీపీ 18 వార్డులు, వైఎస్సార్ సీపీ 11 వార్డులు, కాంగ్రెస్ పార్టీ 4 వార్డులు, స్వతంత్రులు ఇద్దరు అభ్యర్థులు గెలుపొందారు. 12 ఏళ్ల తర్వాత ఇక్కడ ఎన్నికలు జరుగుతుండడంతో అన్ని పార్టీలు ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. శ్రీకాళహస్తి మున్సిపాలిటీలో పాగా వేసేందుకు బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపేందుకు సిద్ధమయ్యాయి. అయితే ఈ సీటును జనసేన ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. మరో వైపు జనసేనకు ఇచ్చేందుకు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి ససేమిర అంటున్నారు. ఇకపోతే పుత్తూరు మున్సిపాలిటీని కూడా బీసీ–జనరల్‌కు కేటాయించారు. నాయుడుపేట, వెంకటగిరి జనసేన పార్టీ పోటీ చేయాలని ఆశించగా, రిజర్వేషన్ల తారుమారుతో వారి ఆశలకు గండికొట్టినట్లు ఆ పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అందరి చూపు బీజేపీ వైపు
మరోవైపు తిరుపతి మేయర్ పీఠం బీజేపీకి దక్కే అవకాశాలున్నాయనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరందుకుంది. టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య పదవుల పంపకాలు ఎలా ఉంటాయన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. జనసేన ఇతర ప్రాంతాలపై దృష్టి సారించే అవకాశాల నేపథ్యంలో తిరుపతి మేయర్ స్థానం బీజేపీకి దక్కవచ్చని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. బీజేపీ నుంచి మేయర్ అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్న వారి జాబితా కూడా పెరుగుతున్నట్లు తెలుస్తోంది. మాజీ సీఎం నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి మద్దతుతో నవీన్‌న్‌కుమార్‌రెడ్డి పేరు ప్రచారంలో ఉంది. మరోవైపు బీజేపీ నేత భానుప్రకాష్‌రెడ్డి తన కుమారుడు పృథ్వీ లేదా భార్యకు అవకాశం కల్పించేందుకు ప్రయత్నిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. డాక్టర్ గుణశేఖర్ కూడా తనకున్న ఆర్థిక బలం, రాజకీయ పరిచయాలతో టికెట్ సాధించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. చదలవాడ సుచరిత సైతం మేయర్ అభ్యర్థిత్వంపై ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. అయితే వీరిలో ఎవరికి పార్టీ అధిష్టానం అవకాశం కల్పిస్తుంది? కూటమిలో సీట్ల సర్దుబాటు ఏ విధంగా జరుగుతుంది?.. అన్నది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఆశావహుల ప్రయత్నాలు, పార్టీ పెద్దల నిర్ణయాలపై మేయర్ అభ్యర్థిత్వం ఆధారపడనుంది.
కూటమిలో మొదలైన కుమ్ములాట
ఆసక్తి రేపుతున్న మేయర్ పోరు
రిజర్వేషన్, కూటమిలో పోటీ తిరుపతి రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి. వైఎస్సార్‌సీపీ తన అభ్యర్థిగా ఎవరిని ఎంపిక చేస్తుంది? బీజేపీకి అవకాశం దక్కితే ఆశావహుల్లో ఎవరిని అధిష్టానం ఖరారు చేస్తుంది? టీడీపీ, జనసేన పాత్ర ఎలా ఉండబోతోంది? అన్న ప్రశ్నలకు రానున్న రోజుల్లో సమాధానం లభించనుంది.
గతంలో వైఎస్సార్‌సీపీ క్లీన్‌స్వీప్
గత కార్పొరేషన్ ఎన్నికల్లో తిరుపతి నగరంలోని 49 డివిజన్లకు ఎన్నికలు జరగ్గా, వైఎస్సార్‌సీపీ 48 డివిజన్లలో విజయం సాధించింది. టీడీపీ ఒక డివిజన్‌న్‌ను దక్కించుకుంది. అప్పట్లో ఏకపక్ష ఆధిపత్యం ప్రదర్శించిన వైఎస్సార్‌సీపీకి, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు సవాల్‌గా మారాయి. మరోవైపు కూటమి పార్టీల మధ్య సమన్వయం, అభ్యర్థుల ఎంపిక, స్థానిక రాజకీయ సమీకరణాలు కీలకం కానున్నాయి.
తిరుపతిలో అంచనాలు తలకిందులు
2021లో జరిగిన తొలి తిరుపతి మేయర్ ఎన్నికల్లో జనరల్ మహిళకు రిజర్వు అయిన స్థానంలో వైఎస్సార్‌సీపీ బీసీ మహిళకు అవకాశం కల్పించింది. సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యమిస్తూ బీసీలకు పెద్దపీట వేసింది. ఈ సారి కూడా బీసీ లేదా ఎస్సీ వర్గాలకు మేయర్ పదవి దక్కవచ్చని పలువురు భావించారు. అయితే తాజా రిజర్వేషన్లలో తిరుపతి మేయర్ స్థానం జనరల్ కేటగిరీకి కేటాయించడంతో ఆ అంచనాలు తలకిందులయ్యాయి. నగరంలో బీసీ జనాభా అధికంగా ఉన్న నేపథ్యంలో ఈ పరిణామంపై ఆ వర్గాల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ స్థానం జనసేనకు కేటాయిస్తే కిరణ్‌రాయల్ సతీమణి రేణుక సీటును ఆశిస్తున్నట్లు సమాచారం. పొత్తులో భాగంగా టీడీపీ కూడా మేయర్ సీటును దక్కించుకునేందుకు సీఎం చంద్రబాబు వద్ద పంచాయితీ పెట్టినట్లు తెలుస్తోంది.


