పోలీసుల దాడి అమానుషం | - | Sakshi
Sakshi News home page

పోలీసుల దాడి అమానుషం

Oct 13 2026 1:53 AM | Updated on Oct 13 2026 1:53 AM

● దివ్యాంగుడు, మహిళనని చూడకుండా దాడి చేస్తారా? ● మండిపడ్డ శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి

రేణిగుంట: రేణిగుంట మండలం, కరకంబాడి రెవెన్యూ పరిధిలోని రామకృష్ణాపురంలో నాలుగు దశాబ్దాలుగా నివాసముంటున్న నిరుపేద కుటుంబంపై అధికార పార్టీ నేతల కనుసన్నల్లో అధికారులు ప్రతాపం చూపడం దారుణమని మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి మండిపడ్డారు. ఈ మేరకు సోమవారం రామకృష్ణపురానికి చేరుకొని బాధిత కుటుంబాన్ని ఆయన ఓదార్చారు. అధికారులు ధ్వంసం చేసిన ఇంటి ఆవరణాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రామకృష్ణాపురంలో దివ్యాంగుడు సురేష్‌, అతడి అన్న రమేష్‌, భార్య చాముండేశ్వరి, ఇద్దరు పిల్లలతో గత 40 ఏళ్లుగా రేకుల ఇంట్లో నివాసముంటున్నారన్నారు. ఈ నెల 8వ తేదీన ఎటువంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా రెవెన్యూ, పోలీసు అధికారులు ఇల్లును కూల్చడానికి రావడం దారుణమన్నారు. బాధితులపై కనికరం లేకుండా, దివ్యాంగుడిని పోలీసులు బూట్లతో తన్ని, మహిళలను జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లడం అత్యంత హేయమైన చర్య అన్నారు. స్థానిక టీడీపీ బూత్‌ కమిటీ నాయకుడు మునికృష్ణ వ్యక్తిగత కక్షతో టీడీపీ కార్యకర్త వల్లేపల్లి కల్లప్ప కార్‌ పార్కింగ్‌, ఇతర భూ ఆక్రమణల దురుద్దేశంతో పోలీసులను, రెవెన్యూ అధికారులను అడ్డంపెట్టుకుని ఈ అరాచకానికి పాల్పడ్డారని ఆరోపించారు. పేద ప్రజల కడుపు కొట్టి, వారి ఇళ్లను నేలమట్టం చేసిన వారిపై, వారికి సహకరించిన అధికారులపై సంబంధిత ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. బాధిత కుటుంబాలకు న్యాయం జరిగే వరకు తమ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అవసరమైతే మహాధర్నాలు, సుప్రీంకోర్టు వరకూ వెళ్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ హరిప్రసాద్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు గంగారి రమేష్‌, పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్‌, రహీం, దయాకర్‌రెడ్డి, యోగేశ్వర్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌లు నగేషం, మునిశేఖర్‌రెడ్డి, హాసన్‌ సాహెబ్‌, జాన్‌బాబు, ఖాదర్‌, గుణశేఖర్‌, ఖదీర్‌, వెంకటరమణ, రహంతుల్లా, మాజీ ఎంపీటీసీ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement