తిరుమల: తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ పూర్తిగా తగ్గిపోయింది. క్యూకాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లు అన్నీ ఖాళీగా ఉన్నాయి. ఆదివారం అర్ధరాత్రి వరకు 71,759 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 20,867 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.37 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు ఒక గంటలో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. దర్శన టిక్కెట్లు లేని వారికి కూడా గంటలో స్వామి దర్శనం లభిస్తోంది.
రైతు బజారులో
తక్కువ ధరకే బియ్యం
తిరుపతి అర్బన్: తిరుపతి అన్నమయ్య సర్కిల్ సమీపంలోని రైతు బజారులో తక్కువ ధరలకే బియ్యం పంపిణీ చేస్తున్నట్టు జేసీ గోవిందరావు తెలిపారు. ఆ మేరకు ఆయన సోమవారం రైతు బజారులో ప్రత్యేక కౌంటర్‌ను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బియ్యం ధరలు పెరిగిపోవడంతోనే తక్కువ ధరకు పేదలకు బియ్యం ఇవ్వాలనే ఉద్దేశంతో వ్యవసాయ మార్కెట్ కమిటీ, సివిల్ సప్లై అధికారుల నేతృత్వంలో ప్రత్యేక కౌంటర్ పెట్టినట్లు చెప్పారు. బీపీటీ కేజీ రూ.49 చొప్పున 26 కిలోల బ్యాగ్ రూ.1,274కి, అలాగే కేఎన్‌ఎం రకం బియ్యం కేజీ రూ.50 చొప్పున 26 కేజీల బస్తా రూ.1,300కు ఇస్తున్నట్లు వివరించారు. అవసరమై వారు రైతు బజారులో కొనుగోలు చేసుకోవచ్చని సూచించారు.
కలెక్టరేట్‌లో సైనిక సంక్షేమశాఖ కార్యాలయం
తిరుపతి అర్బన్: కలెక్టరేట్‌లో సోమవారం సైనిక సంక్షేమ శాఖ కార్యాలయాన్ని విజయవాడ నుంచి విచ్చేసిన ఆ విభాగం సంచాలకుడు సత్యప్రసాద్ ప్రారంభించారు. జిల్లాలో 8వేల మంది మాజీ సైనికులు ఉన్నారని, దాంతోనే తిరుపతిలో కొత్త కార్యాలయం ఏర్పాటు చేసినట్టు ఆయన వెల్లడించారు. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా సైనిక సంక్షేమ శాఖ అధికారి రాఘవులు సూచించారు. అసిస్టెంట్ డైరెక్టర్ బాలాజీ, తిరుపతి జిల్లా మాజీ సైనికుల సంఘం అధ్యక్షుడు ఆనందరెడ్డి, మనోహర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ప్రైవేటు పాఠశాలకు రూ.50వేల జరిమానా
తిరుపతి ఎడ్యుకేషన్ : దసరా సెలవుల్లో నిబంధనలకు విరుద్ధంగా తరగతులు నిర్వహిస్తున్న తిరుపతిలోని ఓ ప్రైవేటు పాఠశాలకు డీఈఓ రూ.50 వేల జరిమానా విధించారు. వివరాల్లోకి వెళితే.. దసరా సెలవుల్లో ఎటువంటి తరగతులు నిర్వహించకూడదని ఇదివరకే డీఈఓ అన్ని పాఠశాలలకు ఆదేశాలు జారీచేశారు. అయితే మంగళం, బీటీఆర్ కాలనీలోని రవితేజ ఇంగ్లిష్ మీడియం పాఠశాల నిబంధనలు ఉల్లంఘిస్తూ తరగతులు నిర్వహిస్తున్నట్లు డీఈఓకు ఫొటోలతో సహా ఫిర్యాదు చేశారు. దీంతో సోమవారం ఆయన ఆదేశాల మేరకు విద్యాశాఖ అధికారులు పాఠశాలను సందర్శించి తరగతులు నిర్వహిస్తున్నట్లు గుర్తించి డీఈఓకు సమాచారం అందించారు. నీ మేరకు ఆ పాఠశాలకు రూ.50వేలు జరిమానా విధించారు.
మూడో విడత కౌన్సెలింగ్
తిరుపతి తుడా: స్విమ్స్‌లో బీఎస్సీ (నర్సింగ్), బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ, బీఎస్సీ అలైడ్ హెల్త్ సైన్సెస్ కోర్సుల్లో మిగిలి ఉన్న సీట్ల భర్తీ కోసం ఆఫ్‌లైన్ విధానంలో మూడో విడత కౌన్సెలింగ్ ప్రక్రియను చేపట్టనున్నట్లు రిజి స్ట్రార్ తెలిపారు. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు ఈనెల 16వ తేదీన ఉదయం 8 గంటలకు స్విమ్స్ పద్మావతి మెడికల్ కళాశాలలో జరగనున్న కౌన్సెలింగ్‌కు హాజరుకావాలని సూచించారు.


