సాక్షి, టాస్క్‌ఫోర్స్: టీడీపీ తిరుపతి నగర మాజీ డెప్యూటీ మేయర్ ఆర్సీ మునికృష్ణకు 35వ డివిజన్ కార్పొరేటర్ టికెట్టు కేటాయించొద్దని కూటమి నాయకులు తెగేసి చెబుతున్నారు. ఆ మేరకు మంగళవారం స్థానిక భవానీనగర్‌లోని మాజీ కౌన్సిలర్ నాగభూషణం అధ్యక్షతన తన కార్యాలయంలో కూటమికి చెందిన పలువురు నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఆర్సీ మునికృష్ణకు కార్పొరేటర్‌గా పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వవద్దంటూ 47వ డివిజన్‌కు చెందిన కూటమి నాయకులు పట్టుబట్టినట్టు తెలుస్తోంది. తమ మాట కాదని టీడీపీ అధిస్టానం కార్పొరేటర్ స్థానానికి టికెట్టు కేటాయిస్తే చిత్తు చిత్తుగా ఓడిస్తామని చెప్పినట్టు సమాచారం. గతంలో 35వ డివిజన్‌గా ఉన్న భవానీనగర్ ప్రస్తుతం 47వ డివిజన్‌కు మార్పు చేశారు. కాగా ఆర్సీ మునికృష్ణ వ్యవహారం స్థానికంగా వ్యతిరేకతకు దారి తీస్తోందనే విషయాన్ని సమావేశంలో ప్రస్తావించినట్లు సమాచారం. ఆయన గతంలో కార్పొరేటర్‌గా గెలిచి వార్డు ప్రజలకు ఏమాత్రం అందుబాటులో లేకపోగా ఒక నియంతలాగా వ్యవహరించారనే విషయాన్ని గుర్తుచేశారు. వార్డు అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం ఏనాడూ దృష్టి పెట్టలేదనే విషయాన్ని చర్చించినట్లు తెలుస్తోంది. ఆయన వ్యవహార శైలితో ప్రజలంతా విసిగిపోయారని, తెలుగుదేశం పార్టీకి తీరని ద్రోహం చేసిన దగాకోరు వ్యక్తి అంటూ ఆరోపణలు వ్యక్తమైనట్లు తెలిసింది. త్వరలో జరగబోయే తిరుపతి కార్పొరేషన్ ఎన్నికలలో 47వ డివిజన్‌లోని స్థానిక టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నాయకులు అందరూ సమన్వయం చేసుకొని కలిసికట్టుగా తీసుకున్న నిర్ణయం మేరకు ఆర్‌సీ మునికృష్ణకు కాకుండా మరి ఎవరికై నా టికెట్ ఇస్తే అందరం కలిసికట్టుగా పనిచేసే గెలిపించుకుందామనే ప్రతిజ్ఞ చేసినట్టు సమాచారం. భవానీనగర్‌కు చెందిన టీడీపీ నాయకులు మైనం బాలాజీ, రవితేజ నాయుడు కార్పొరేటర్‌గా పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్న వారికి స్థానిక కూటమి నాయకులు, కార్యకర్తలు మద్దతు ఉన్నారనే అంశం ప్రాస్తవనకు వచ్చినట్లు సమాచారం.


