ఆయన అధికారంలోకి వస్తే కరువు విలయతాండవమే వ్యవసాయమే దండగ అన్న రైతు ద్రోహి చంద్రబాబు రైతులు కరువుతో అల్లాడుతుంటే హార్టికల్చర్ హబ్ అంటూ అభూతకల్పన వైఎస్సార్‌సీపీ రీజనల్ కో–ఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆగ్రహం
తిరుపతి మంగళం : కరువు, చంద్రబాబు కవల పిల్లలు లాంటి వారని, చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కరువు విలయతాండవం చేస్తుందని వైఎస్సార్‌సీపీ రీజనల్ కో–ఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. తిరుపతి మారుతీనగర్‌లోని తన నివాసం వద్ద శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో గతంలో 14 ఏళ్లు, మళ్లీ ప్రస్తుతం రెండున్నరేళ్లుగా చంద్రబాబు పాలనలో ప్రజలు, రైతులు కరువుతో అల్లాడిపోతున్నారన్నారు. పంటలు పండక, చేసిన అప్పులు తీర్చలేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే టీడీపీ మంత్రులతో అవహేళన చేసి మాట్లాడిస్తున్న దుర్మార్గుడు చంద్రబాబు అన్నారు. అసలు వ్యవసాయమే దండగ అన్న రైతు ద్రోహి చంద్రబాబు అని మండిపడ్డారు. మాయమాటలు, మోసం, వంచనతో చంద్రబాబు అధికారంలోకి వస్తున్నాడే తప్ప ప్రజలు ఆదరించి కాదన్నారు. ఎన్నికల్లో చెప్పిన హామీల్లో ఇంతవరకు ఏ ఒక్కటీ నెరవేర్చలేదన్నారు. చంద్రబాబు ఎప్పుడూ తనకు కావాల్సిన వారికి తప్ప ప్రజలకు, రైతులకు మేలు చేసిన పరిస్థితే లేదన్నారు. ప్రజలు, రైతులు కరువుకాటకాలతో అల్లాడుతుంటే రూ.లక్ష కోట్లతో హార్టికల్చర్ హబ్ ఏర్పాటు చేస్తామని మాయమాటలు చెప్పడం సిగ్గుచేటన్నారు. ఇటీవల మదనపల్లి సభలో, వైజాగ్‌లో తాను దేవుడిని ప్రార్థించడంతో 20 సెం.మీ వర్షపాతం కురిసిందని చెప్పిన చంద్రబాబు, రాయలసీమలో ప్రజలు, రైతులు కరువుతో అల్లాడుతుంటే ఆయన ఎందుకు దేవుడిని ప్రార్థించి వర్షం కురుపించలేదని ప్రశ్నించారు. చంద్రబాబు మోసాలు, వంచనను ప్రజలంతా గ్రహించారని, త్వరలోనే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీదే విజయం
స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీదే విజయమని పెద్దిరెడ్డి స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలపై తన నివాసం వద్ద ఎమ్మెల్సీ భరత్‌తో పాటు కుప్పం నాయకులు హఫీజ్, మోహన్‌కావు, శివకుమార్ తదితరులతో ఆయన సమావేశం నిర్వహించారు. రాష్ట్రంతో పాటు కుప్పంలోనూ చంద్రబాబు పాలనపై ప్రజలు విసిగిపోయి ఉన్నారన్నారు. ఇప్పటికే ఉద్యోగులు, టీచర్లు రోడ్లపైకి వచ్చి ఉద్యమాలు చేపడుతున్న పరిస్థితి నెలకొందన్నారు. చంద్రబాబు మోసాలను గ్రహించిన ప్రజలు రానున్న స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి ఓట్లు వేసి గట్టిగా బుద్ధి చెప్పాలన్న కసితో ఉన్నారన్నారు.


