తిరుపతి ఎడ్యుకేషన్ : తిరుపతి జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు దసరా సెలవుల్లో నిబంధనలకు విరుద్ధంగా తరగతులు నిర్వహిస్తే ఆయా పాఠశాలలపై చర్యలు తప్పవని డీఈఓ కేవీఎన్.కుమార్ హెచ్చరించారు. సాధారణ సెలవులతో కలుపుకుని ఈ నెల 10 నుంచి 21వ తేదీ వరకు దసరా సెలవులు ఉంటాయని తెలిపారు. సాధారణ పాఠశాలలకు 12 నుంచి 21వ తేదీ వరకు దసరా సెలవులు, క్రిస్టియన్ మైనారిటీ పాఠశాలలకు అక్టోబరు 15 నుంచి 21వ తేదీ వరకు దసరా సెలవులు ఉంటాయని పేర్కొన్నారు. ఎవరైనా దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తున్నట్లు ఫిర్యాదు అందితే సంబంధిత పాఠశాలలపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు పాఠశాల గుర్తింపు రద్దుకు చర్యలు తీసుకుంటామని డీఈఓ హెచ్చరించారు.
వారు తక్షణమే విధుల్లో చేరాలి
తిరుపతి ఎడ్యుకేషన్ : తిరుపతి జిల్లా పరిధిలో ఉన్నతాధికారుల అనుమతి లేకుండా విధులకు గైర్జాజరైన ఇద్దరు ఉపాధ్యాయులు తక్షణమే విధుల్లో చేరాలని డీఈఓ కేవీఎన్.కుమార్ తెలిపారు. రేణిగుంట బాలుర జెడ్పీ హైస్కూల్ ఇంగ్లిష్ టీచర్ (స్కూల్ అసిస్టెంట్) ఎస్.నాగేశ్వరరావు ఆగస్టు 21న లీప్ యాప్‌లో సెలవుకు దరఖాస్తు చేసుకున్నప్పటికీ సంబంధిత అధికారుల అనుమతి లేకున్నా వరుస సెలవులో ఉన్నారని తెలిపారు. అలాగే ఏర్పేడు మండలం, వెంకటపాళెం ఎంపీపీఎస్ పాఠశాల ఎస్జీటీ ఉపాధ్యాయుడు ఎన్.మునికృష్ణ సైతం అధికారుల అనుమతి లేకుండా 21–08–2026 నుంచి సెలవులో ఉన్నట్లు పేర్కొన్నారు. తక్షణమే వీరివురూ విధుల్లో చేరాలని, లేనిపక్షంలో సీసీఏ నిబంధనల మేరకు వీరిపై క్రమశిక్షణ చర్యలు తప్పవని డీఈఓ హెచ్చరించారు.
వేద విద్యను విశ్వవ్యాప్తం చేయడమే లక్ష్యం
తిరుపతి సిటీ: ఎస్వీ వేదిక్ వర్సిటీ ద్వారా వేద విద్యను విశ్వవ్యాప్తం చేసి, అందరి సహకారంతో వర్సిటీని అభివృద్ధి పథంలో నడపడమే లక్ష్యంగా పనిచేస్తానని వీసీ ప్రొఫెసర్ గణపతి భట్ పేర్కొన్నారు. వేదిక్ వర్సిటీ నూతన వీసీగా శుక్రవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గతంలో పనిచేసిన వీసీలు వర్సిటీని అభివృద్ధి పథంలో నడిపారని, వారి స్ఫూర్తితో మరింత ఉన్నత స్థితికి వర్సిటీని చేర్చేందుకు కృషి చేస్తానని తెలిపారు. అనంతరం రిజిస్ట్రార్ డాక్టర్ బలభద్ర ఉపాధ్యాయ, డీన్ డాక్టర్ రాధేశ్యామ్, పీఆర్‌ఓ డాక్టర్ గంజాం రామకృష్ణ, వేద పండితులు నూతన వీసీని ఘనంగా సత్కరించి అభినందించారు.


