తిరుపతి అర్బన్: గడువులోపు భూముల రీసర్వే పనులు పూర్తి చేయాలని సీసీఎల్‌ఏ(చీప్ కమిషనర్ ఆప్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్) కమిషనర్ జి.జయలక్ష్మి సిబ్బందిని ఆదేశించారు. శనివారం ఆమె తిరుపతి కలెక్టరేట్‌లో కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్, జేసీ గోవిందరావు, డీఆర్వో నరసింహులుతో కలసి అధికారులతో సమీక్షించారు. రీసర్వేతోపాటు పట్టాదార్ పాస్‌పుస్తకాల పంపిణీ, మ్యుటేషన్, ఈకేవైసీ, వెబ్‌ల్యాండ్ పోస్టింగ్, పీజీఆర్‌ఎస్‌కు వచ్చే దరఖాస్తుల పరిష్కారం తదితర అంశాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. జిల్లాలో 1,034 గ్రామాల్లో రీసర్వేకు సంబంధించి 15,02,809 ఎకరాల విస్తీర్ణంలో రీసర్వే ప్రక్రియను 2027 మార్చికి పూర్తి చేయడమే లక్ష్యంగా పనిచేయాలని ఆదేశించారు.


